మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
సాక్షి, చింతకాని(ఖమ్మం): చినమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు ప్రాంతాల నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. చినమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరు ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది టాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు అరికట్టలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్‌ఏ నుంచి తహసీల్దార్ వరకు ఎవరి ప్రమేయం లేకుండానే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా... అని అధికారులను ప్రశ్నించారు. మండలంలో ఇకనుంచి ఇసుక అక్రమ రవాణా జరిగితే జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాగునీరు కలుషితం
మండలంలో మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు కలుషితంగా ఉంటున్నాయని, మిషన్ భగీరథ నీటిని తాగలేకపోతున్నామని మండల ప్రజాప్రతినిధులు భట్టికి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పనుల కోసం గ్రామాల్లోని సీసీ రోడ్లను నాశనం చేస్తున్నారని, ఇష్టారాజ్యంగా సీసీ రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద సీసీ రోడ్లను తవ్వితే సంబంధిత కాంట్రాక్టర్‌తో రోడ్లకు మరమ్మతు పనులు చేయించాలని పీఆర్ ఏఈని ఆదేశించారు. మండలంలో పట్టాదారు పాసుపుస్తకాలు రాని రైతులు చాలామంది ఉన్నారని, పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన కొంతమంది రైతులకు సంబంధించిన విస్తీర్ణం పుస్తకాల్లో నమోదు కాలేదని భట్టి విన్నవించారు. రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల సమస్యను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
కిసాన్ పథకం డబ్బులు జమ కావడం లేదు
రైతుబంధు సాయంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం డబ్బులు మండలంలో చాలామంది రైతుల ఖాతాల్లో జమ కావటం లేదని, వ్యవసాయాధికారులను అడిగితే సరైన సమాచారం చెప్పటం లేదని రైతులు భట్టికి ఫిర్యాదు చేశారు. రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ డబ్బుల్ని రైతుల ఖాతాలకు జమ అయ్యేట్లు వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని భట్టి తెలిపారు. మండలంలో ఉద్యాన అధికారుల జాడే లేదని, విత్తనాలు కూడా సరిపడా రాలేదని తెలిపారు. పాతర్లపాడు రైల్వేకాలనీ ప్రాధమిక పాఠశాల శిథిలావస్థలో ఉందని, నూతన భవనాన్ని నిర్మించాలని పాఠశాల హెచ్‌ఎం భట్టికి విన్నవించారు.
వ్యవసాయ విద్యుత్ లైన్లకు సంబంధించి స్తంభాలను ఏర్పాటు చేయాలని, గాంధీనగర్‌కాలనీ, జగన్నాథపురం, రాఘవాపురం గ్రామాల్లోని ఇళ్లపై నుంచి వెళ్లిన 33 కేవీ విద్యుత్ లైన్లను మార్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. చింతకాని దేవాలయ భూముల సమస్యను భట్టి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండల ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, జెడ్పీటీసీ సభ్యులు కూరపాటి తిరీషా, ఎంపీడీఓ లలితకుమారి, తహశీల్దార్ కె. సత్యనారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment