సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఖమ్మం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్స్ చేస్తున్నాయి. ఇక, రేపటి సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ చేరునున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచిన వేళ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. రేపు ఖమ్మం సభలో భారీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ పార్టీకి నేతలు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయన బాటలోనే సత్తుపల్లిలో ముగ్గురు కౌన్సిలర్లు అధికార పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటితో కలిసి ముందుకెళ్తున్నట్టు ముగ్గురు కౌన్సిలర్లు ప్రకటించారు.
ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి పకడ్బందీగా చేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సభకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టిస్తోంది. కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. సభ జరిగే రోజున ఖమ్మంలో మంచినీరు వదలొద్దని అధికారులను ఆదేశిస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో సభ విజయవంతం కావొద్దని జిల్లా మంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మా వల్లే పార్టీ హైలైట్ అయ్యింది.. మమ్మల్నెందుకు పట్టించుకోరు..
Comments
Please login to add a commentAdd a comment