పొంగులేటి మార్క్‌ పాలిటిక్స్‌.. ఖమ్మంలో ఎంపీ సీటు ఖరారు? | Ponguleti Prasad Reddy Had Chance For Khammam Congress MP Seat | Sakshi
Sakshi News home page

పొంగులేటి మార్క్‌ పాలిటిక్స్‌.. ఖమ్మంలో ఎంపీ సీటు ఖరారు?

Published Fri, Dec 22 2023 9:13 PM | Last Updated on Fri, Dec 22 2023 9:24 PM

Ponguleti Prasad Reddy Had Chance For Khammam Congress MP Seat - Sakshi

అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ తీవ్రంగా ఉంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కో ఎమ్మెల్యే సీటే దక్కుతోంది. ఈసారి ఒక్కటి మినహా మిగిలిన అసెంబ్లీ సీట్లన్నీ కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. దీంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం డిమాండ్‌ బాగా పెరిగింది. మరి కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తామంటున్న ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్న నేతలెవరు?..

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో సీపీఐ పోత్తుల్లో భాగంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి కేబినెట్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే అత్యధికంగా ముగ్గురు మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజార్టీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ తరువాతి టార్గెట్ లోకసభ ఎన్నికలే. తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒక ఎత్తైయితే కీలకమైన లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కూడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. 

ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్‌లో అప్పుడే పోరు మొదలైంది. జిల్లాలోనే కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ మోజార్టీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి.

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందున లోక్‌సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్‌ రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారనే టాక్ నడుస్తోంది. 

ఇదిలా ఉంటే మాజీ కేంద్రమంత్రి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం ఎంపీ టికెట్ కోసం పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టిక్కెట్ విషయంపై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోకసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గానే పోటీ ఉండనుంది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్‌లో టిక్కెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. మరి కాంగ్రెస్ హైకమాండ్‌ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement