'వారికి ఓట్లు అడిగే అర్హత లేదు' | Bhatti Vikramarka Comments About Municipal Elections In Madhira | Sakshi
Sakshi News home page

'వారికి ఓట్లు అడిగే అర్హత లేదు'

Published Tue, Dec 31 2019 9:04 AM | Last Updated on Tue, Dec 31 2019 9:08 AM

Bhatti Vikramarka Comments About Municipal Elections In Madhira - Sakshi

సాక్షి, మధిర : ప్రజా సమస్యలు పరిష్కరించని అధికార పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాలని్నంటినీ సీఎం కేసీఆర్‌ కేంద్రీకృతం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అన్నింటికీ సర్వాధికారిగా ముఖ్యమంత్రే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అన్ని అధికారాలను తన వద్దనే ఉంచుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసమని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పౌరులకు, అధికారులకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వింత చర్యలను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆరేళ్లుగా ఉద్యోగాల భర్తీ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని చెప్పారు. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మౌలిక వసతులు కరువయ్యాయని, ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే భవిష్యత్‌ అంధకారమని పేర్కొన్నారు.

ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు అప్పుచేశారని, ఇంకా అప్పులు చేసి ప్రభుత్వం ప్రజలను తాకట్టు పెడుతోందన్నారు. సమగ్ర ప్రణాళికతో, సంపూర్ణ అభివృద్ధితో మధిర అభివృద్ధికి ఆలోచించే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామని, చైర్మన్‌గా మధిర మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది తూములూరి కృష్ణారావు, సభ్యులుగా వీరమాచనేని శ్రీనివాసరావు, కటుకూరి శ్యామారావు, బిక్కి రాజా, మైనిడి జగన్మోహన్‌రావు, సయ్యద్‌ రషీద్‌ తదితరులు ఉంటారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement