ఎమ్మెల్యే చల్లా కు తప్పిన ప్రమాదం
జనగామ: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గా యాలుకాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన భార్య జ్యోతి, కూతుళ్లు మానస, జాహ్నవి, మనవరాలు మూడు నెలల పాపతో కలసి ఇన్నోవాలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వస్తున్నారు. వర్ధన్నపేట మండలం రాపర్తికి చెందిన అయిత కుమార్(కారు యజమాని, డ్రైవర్), వెంకటలక్ష్మి... పిల్లలు హరీష్, అభి లు హైదరాబాద్‌లో ఉంటూ జఫర్‌గఢ్‌లో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు ఇండికా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జనగామ శివారులోని ఉడుముల ఆస్పత్రి వద్ద వీరి ఇండికా వాహనం వేగంగా వచ్చి ఎమ్మెల్యే చల్లా ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భార్య జ్యోతి, పెద్ద కూతురు మానస, మానస కూతురైన మూడు నెలల పాప, డ్రైవర్ అడాల సతీష్ స్వల్ప గాయాలతో బయటపడగా.. జాహ్నవి తలకు తీవ్ర గాయమై రక్త స్రావమైంది. ఇండికా కారులో ఉన్న అయితకుమార్, వెంకటలక్ష్మి తల, చేతులకు తీవ్ర గాయాలు కాగా... మానస చేయి విరిగిపోయింది. వెంకటలక్ష్మి కొడుకులు హరీశ్, అభి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక మరోకారులో వస్తున్న టీఆర్‌ఎస్ జనగామ మండల శాఖ అధ్యక్షుడు కళింగరాజు ప్రమాద ఘటనను చూసి ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను భువనగిరి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించారు.