Parakala MLA
-
ఎమ్మెల్యే ఇంటిపై దాడి కేసులో 43 మందికి రిమాండ్
సాక్షి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో వరంగల్ జిల్లా కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 43 మందికి ఈనెల 15వరకు రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా భాజపా వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ. ఏ-2గా వరంగల్ రూరల్ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఉన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై భాజపా నేతలు, కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. కాగా, ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ పరకాల పట్టణ బందుకు పిలుపునిచ్చింది. -
ఎమ్మెల్యే ‘చల్లా’ క్షమాపణ చెప్పాలి
వరంగల్ రూరల్ : కలెక్టరేట్ సూపరింటెండెట్, తహసీల్దార్ జి.సదానందం, నర్సంపేట తహసీల్దార్ పూల్ సింగ్‌పై అనుచితంగా ప్రవర్తించిన పరకాల ఎమ్యెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను శనివారం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సదానందం, పూల్ సింగ్‌పై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అతడి గన్‌మెన్, పరకాల జెడ్పీటీసీ పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాప్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు తహసీల్ కార్యాలయాల ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని తహసీల్దార్లు, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, ట్రెస్సా నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఈ-సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్ జి.సదానందం మాట్లాడుతూ తాను లంచం అడిగినట్టు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలో నిజం లేదని, కావాలని తాను ఫైల్ విషయంలో జాప్యం చేయలేదన్నారు. నర్సంపేట తహసీల్దార్ పూల్ సింగ్ మాట్లాడుతూ సదానందంతోపాటు తనపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆయన ఇద్దరు గన్మెన్లు, పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడికల్పనా దేవి, ఆమె భర్త పాడి ప్రతాపరెడ్డి, ఇద్దరు ఎమ్యేల్యే గన్మెన్లు దాడి చేశారని ఆరోపించారు. నిరసన ప్రదర్శనలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు పి.సత్యనారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ, కార్యదర్శి కె.విక్రమ్‌కుమార్, టీఎన్జీఓల సంఘం కార్యదర్శి షఫీ, రత్నవీరాచారి, టీఈఏ అధ్యక్షుడు కె.యాదగిరి, టీఎస్ఎస్ఏ అధ్యక్షుడు కె.రమేష్, టీజీటీఏ అధ్యక్షులు రాంమూర్తి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు రమేష్, జిల్లా అధ్యక్షురాలు సుహసిని, టీఆర్ఈఎస్ఏ ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, టీఆర్ఈఎస్ఏ నాయకులు ఫణికుమార్, టీజీటీఏ అసిస్టెంట్ ప్రెసిడెంట్ పూల్ సింగ్, టీఈఏ అధ్యక్షుడు వేణుగోపాల్, ఎంఈడబ్ల్యూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ.రియాజ్, ఆఫీస్ సబార్డినేట్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్లపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
వరంగల్ రూరల్ : ఇద్దరు తహసీల్దార్లపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు. ఒక ఫైల్ విషయంలో చర్చించడానికి వచ్చిన ఎమ్మెల్యే.. కలెక్టరేట్ ఈ-సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్ జి.సదానందం, నర్సంపేట తహసీల్దారు ఫూల్‌సింగ్‌ను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సంపేట తహసీల్దారు ఈ మొత్తం సంఘటనను వీడియో తీసినందుకు అతడిపై పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే గన్‌మెన్ చేయి చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో కలెక్టరేట్ జీ-సెక్షన్ ఉద్యోగులు, సిబ్బంది సాక్షులుగా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నెక్కొండ తహసీల్దార్ విశ్వనారాయణ, రాయపర్తి తహసీల్దార్, ట్రెస్సా ఉపాధ్యక్షుడు రాంమూర్తి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పీఎస్.ఫణికుమార్ ఉన్నారు. కాగా, కలెక్టర్ హరితపై ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఉనికి కోసమే ఉత్తమ్‌కుమార్ ఆరాటం
ఆత్మకూరు(పరకాల) : ఉనికికోసమే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరాటపడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరకాలలో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర విఫలమైందన్నారు. స్టేజీ మీదనే కాంగ్రెస్ టికెట్ల కొట్లాట కనిపించిందని, ప్రతిపక్ష పాత్ర పోషించలేని ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయిలేదన్నారు. తన నియోజకవర్గంలో పనిచేయని ఓ కాంగ్రెస్ నాయకుడు పరకాల సెగ్మెంట్లో ఓ అభ్యర్థిని తయారుచేయడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో రౌడీయిజం చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే ముఖ్యమంత్రి, స్పీకర్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలకు దిగుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. భూరికార్డుల సమగ్రంగా ప్రక్షాళన చేసి రైతులకు పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధమవుతుంటే మింగుడుపడక విమర్శలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు. -
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
ఆత్మకూరు(పరకాల) : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరిస్తున్న చెరువుపనులతోపాటు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఏప్రిల్ 15 నాటికి ఇంటింటికీ గోదావరి జలాలు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఆత్మకూరు మండలంలో 98శాతం భూప్రక్షాళన పూర్తయిందని, త్వరలోనే ఈపాస్బుక్కులు అందించడానికి కసరత్తు జరుగుతోందన్నారు. అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా ఉన్నామని పేర్కొన్నారు. గత పాలకులు అవినీతికి పాల్పడి సొంత పార్టీల వారికే లబ్ధిచేకూర్చారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపు మల్లికార్జున్, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, టీఆర్ఎస్ నాయకులు కానుగంటి సంపత్‌కుమార్, కేశవరెడ్డి, జాకీర్‌అలీ, మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణ, ఎన్కతాల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటా... మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల భిక్షపతి, వార్డుసభ్యుడు నరహరి, ఎస్ఎంసీ చైర్మన్ వేణుతోపాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషిచేయాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ మండలకేంద్రంలో తెలంగాణ జానపద కళాకారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తున్నదని చెప్పారు. కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోల్కొండ వెంకన్న, గౌరవ సలహదారుడు బుచ్చిరెడ్డి, భిక్షపతి, కుమార్, రమేష్ పాల్గొన్నారు. -
పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా
వరంగల్ : వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే తన తండ్రికి మంత్రి పదవి వస్తుందని... ఎమ్మెల్యే కుమార్తె శ్యాంరెడ్డి మానస రెడ్డి... కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు కోయదొరలను సంప్రదించారు. కాశీలో పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని, అక్కడకు వెళ్ళి పూజలు చేస్తామని అందుకోసం కోసం ఖర్చు అవుతుందని కోయదొరలు నమ్మించారు. ఈ క్రమంలో మానస నుంచి సుమారు రూ.57 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. చివరికి మోసపోయామని గుర్తించిన ఆమె ఈ విషయాన్ని ఇంట్లోవారికి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన కోయదొరలు లక్ష్మణరాజు, వంశీరాజులపై 420, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్యే చల్లా కు తప్పిన ప్రమాదం
జనగామ: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గా యాలుకాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన భార్య జ్యోతి, కూతుళ్లు మానస, జాహ్నవి, మనవరాలు మూడు నెలల పాపతో కలసి ఇన్నోవాలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వస్తున్నారు. వర్ధన్నపేట మండలం రాపర్తికి చెందిన అయిత కుమార్(కారు యజమాని, డ్రైవర్), వెంకటలక్ష్మి... పిల్లలు హరీష్, అభి లు హైదరాబాద్‌లో ఉంటూ జఫర్‌గఢ్‌లో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు ఇండికా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో జనగామ శివారులోని ఉడుముల ఆస్పత్రి వద్ద వీరి ఇండికా వాహనం వేగంగా వచ్చి ఎమ్మెల్యే చల్లా ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భార్య జ్యోతి, పెద్ద కూతురు మానస, మానస కూతురైన మూడు నెలల పాప, డ్రైవర్ అడాల సతీష్ స్వల్ప గాయాలతో బయటపడగా.. జాహ్నవి తలకు తీవ్ర గాయమై రక్త స్రావమైంది. ఇండికా కారులో ఉన్న అయితకుమార్, వెంకటలక్ష్మి తల, చేతులకు తీవ్ర గాయాలు కాగా... మానస చేయి విరిగిపోయింది. వెంకటలక్ష్మి కొడుకులు హరీశ్, అభి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక మరోకారులో వస్తున్న టీఆర్ఎస్ జనగామ మండల శాఖ అధ్యక్షుడు కళింగరాజు ప్రమాద ఘటనను చూసి ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను భువనగిరి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించారు. -
పరకాల ఎమ్మెల్యేకు ‘కొత్త’ కష్టాలు
టీఆర్ఎస్లో ఆదరణపై సందేహాలు చేరిక కార్యక్రమానికి ముఖ్యనేతలు డుమ్మా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గైర్హాజరు సాక్షి ప్రతినిధి, వరంగల్ : అధికార పార్టీలో చేరిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రాధాన్యత పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలందరూ ధర్మారెడ్డికి దూరంగానే ఉంటున్నారు. నెల రోజుల క్రితమే టీడీపీకి దూరమైన ధర్మారెడ్డి మూడు రోజుల క్రితం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు స్వయంగా ధర్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ధర్మారెడ్డి చేరిక కార్యక్రమానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు మొలుగూరి భిక్షపతి, ముద్దసాని సహోదర్‌రెడ్డి మాత్రమే ధర్మారెడ్డి చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహోదర్‌రెడ్డి కూడా ఆఖరి నిమిషంలో హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీరు ముగ్గురు తప్పా జిల్లాలోని ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ చేరిక కార్యక్రమానికి వెళ్లలేదు. ప్రాధాన్యతపై సందేహాలు ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ తరుఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనచారి స్పీకర్ పదవిలో ఉండడంతో రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదు. స్పీకర్‌ను మినహాయిస్తే మిగిలిన వారు హాజరుకావాల్సి ఉంది. ప్రజాప్రతినిధులతోపాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ధర్మారెడ్డికి టీఆర్ఎస్లో ప్రాధాన్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలు ఏమిటనేది ధర్మారెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. ‘డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ నెల 4న టీఆర్ఎస్లో చేరినప్పుడు ఎ.చందులాల్, కొండా సురేఖ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ధర్మారెడ్డి చేరికకు మాత్రం ఒక్క ఎమ్మెల్యే రాలేదు. మేం భారీగా జనసమీకరణతో వెళ్లినా.. అక్కడ జరిగిన కార్యక్రమం సంతృప్తికరంగా లేదు’ అని ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండే పరకాల నేతలు చర్చించుకుంటున్నారు.చేరిక సమయంలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుం దని వీరు అనుకుంటున్నారు. సొంత నియోజకవర్గాల్లో కార్యక్రమాలతో జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి కార్యక్రమానికి రాలేదని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. చివరకు చేరిక.. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాను ఎదుర్కొని ధర్మారెడ్డి పరకాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మారిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి ధర్మారెడ్డి అక్టోబరు 9న సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరు ముగ్గురు టీఆర్ఎస్లో చేరడం ఖరారైంది. ధర్మారెడ్డి మరుసటి రోజు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రకటన చేసిన వారంలోపే ఆయన టీఆర్ఎస్లో చేరుతారని భావించారు. పరకాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు కొందరు ఆయన చేరికపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇతర రాజకీయ కారణాలతో కార్యక్రమం వాయిదా పడింది. శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు అక్టోబరు 29న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ధర్మారెడ్డి కూడా పరకాలలో సభను నిర్వహించి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరాలని భావించారు. జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు కొందరు దీనిని అడ్డుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే చేరిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఇంత దూరం రావాల్సిన అవసరంలేదని చెప్పడంతో పరకాల సభ ప్రతిపాదన అంతటితో ఆగింది. ఆ తర్వాత ధర్మారెడ్డి నవంబర్ 2న టీఆర్ఎస్లో చేరుతారని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ పర్యటనతో ఇది వాయిదా పడింది. చివరికి ఈ నెల 9న ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. సాధారణ ఎన్నికల్లో పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సహోధర్రెడ్డిని ఒక్క రోజు ముందే ధర్మారెడ్డి కలిశారు. ఇది జరగకుంటే సహోదర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండేవారని పరకాల టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పరకాలకు గతంలో ప్రాతినిథ్యం వహించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కూడా ధర్మారెడ్డి చేరిక కార్యక్రమానికి వెళ్లలేదు. ధర్మారెడ్డి మిగిలిన వారితో సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే ఆయన టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయిందని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. అందరిని కలుపుకునిపోతే బాగుండేదని ధర్మారెడ్డి వర్గీయులూ అంటున్నారు. -
టీఆర్ఎస్లో చేరిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఉదయం 11గంటలకు సుమారు వెయ్యిమంది అనుచరులతో తెలంగాణ భవన్‌కు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, ధర్మారెడ్డి చేరికే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేరికతో టీఆర్ఎస్ మరింత బలోపేతమైందన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. సంక్షేమ పథకాల్లో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్న నాయకులే కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు, పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
టికెట్ ఇవ్వకపోవడం బాధాకరం: బిక్షపతి
పరకాల, న్యూస్‌లైన్: ఉద్యమంలో కేసులు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న త మకు తెలంగాణలో న్యాయం జరగుతుందని భావిస్తే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. మంగళవారం పరకాలలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మరోసారి ఆలోచించి న్యాయం చేయాలని కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పరకాలలో ఉద్యమ పార్టీ బలోపేతానికి కృషి చేసిన బిక్షపతికి తీరని అన్యాయం చేశారన్నారు. సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు చెబుతుండగా బిక్షపతి కన్నీరు పెట్టుకున్నారు. మొలుగూరి యువ సేన అధ్యక్షుడు ఏకు కిరణ్... బిక్షపతికి టికెట్ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు.