పరకాల ఎమ్మెల్యేకు ‘కొత్త’ కష్టాలు
టీఆర్‌ఎస్‌లో ఆదరణపై సందేహాలు
చేరిక కార్యక్రమానికి ముఖ్యనేతలు డుమ్మా
ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గైర్హాజరు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అధికార పార్టీలో చేరిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి ప్రాధాన్యత పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలందరూ ధర్మారెడ్డికి దూరంగానే ఉంటున్నారు. నెల రోజుల క్రితమే టీడీపీకి దూరమైన ధర్మారెడ్డి మూడు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు స్వయంగా ధర్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే ధర్మారెడ్డి చేరిక కార్యక్రమానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు మొలుగూరి భిక్షపతి, ముద్దసాని సహోదర్‌రెడ్డి మాత్రమే ధర్మారెడ్డి చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సహోదర్‌రెడ్డి కూడా ఆఖరి నిమిషంలో హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీరు ముగ్గురు తప్పా జిల్లాలోని ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ చేరిక కార్యక్రమానికి వెళ్లలేదు.
ప్రాధాన్యతపై సందేహాలు
ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్ తరుఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనచారి స్పీకర్ పదవిలో ఉండడంతో రాజకీయ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదు. స్పీకర్‌ను మినహాయిస్తే మిగిలిన వారు హాజరుకావాల్సి ఉంది. ప్రజాప్రతినిధులతోపాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ధర్మారెడ్డికి టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలు ఏమిటనేది ధర్మారెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు.
‘డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ నెల 4న టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఎ.చందులాల్, కొండా సురేఖ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ధర్మారెడ్డి చేరికకు మాత్రం ఒక్క ఎమ్మెల్యే రాలేదు. మేం భారీగా జనసమీకరణతో వెళ్లినా.. అక్కడ జరిగిన కార్యక్రమం సంతృప్తికరంగా లేదు’ అని ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండే పరకాల నేతలు చర్చించుకుంటున్నారు.చేరిక సమయంలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుం దని వీరు అనుకుంటున్నారు. సొంత నియోజకవర్గాల్లో కార్యక్రమాలతో జిల్లాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి కార్యక్రమానికి రాలేదని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
చివరకు చేరిక..
సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవాను ఎదుర్కొని ధర్మారెడ్డి పరకాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మారిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి ధర్మారెడ్డి అక్టోబరు 9న సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరు ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖరారైంది. ధర్మారెడ్డి మరుసటి రోజు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రకటన చేసిన వారంలోపే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని భావించారు. పరకాలకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కొందరు ఆయన చేరికపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇతర రాజకీయ కారణాలతో కార్యక్రమం వాయిదా పడింది.
శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్‌లు అక్టోబరు 29న కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తీగల కృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ధర్మారెడ్డి కూడా పరకాలలో సభను నిర్వహించి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరాలని భావించారు. జిల్లాలోని టీఆర్‌ఎస్ నేతలు కొందరు దీనిని అడ్డుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే చేరిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఇంత దూరం రావాల్సిన అవసరంలేదని చెప్పడంతో పరకాల సభ ప్రతిపాదన అంతటితో ఆగింది. ఆ తర్వాత ధర్మారెడ్డి నవంబర్ 2న టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఛత్తీస్‌గఢ్ పర్యటనతో ఇది వాయిదా పడింది. చివరికి ఈ నెల 9న ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
సాధారణ ఎన్నికల్లో పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సహోధర్‌రెడ్డిని ఒక్క రోజు ముందే ధర్మారెడ్డి కలిశారు. ఇది జరగకుంటే సహోదర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండేవారని పరకాల టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. పరకాలకు గతంలో ప్రాతినిథ్యం వహించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కూడా ధర్మారెడ్డి చేరిక కార్యక్రమానికి వెళ్లలేదు. ధర్మారెడ్డి మిగిలిన వారితో సమన్వయం చేసుకోలేకపోవడం వల్లే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిక కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయిందని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. అందరిని కలుపుకునిపోతే బాగుండేదని ధర్మారెడ్డి వర్గీయులూ అంటున్నారు.