సాక్షి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంద్, అరెస్టులు, పోటాపోటీ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హోరెత్తించారు. ఆదివారం అర్ధరాత్రి పరకాలలో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడం.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా టీఆర్‌ఎస్ పరకాల బంద్‌కు పిలుపునివ్వడం.. మరోవైపు బీజేపీ నేతల అరెస్టులతో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే చల్లా వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలోని ఆయన ఇంటిపై ఆదివారం బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం.. ప్రతిగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతి దాడికి దిగిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు, పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు.
చదవండి: గ్రామ సింహాలు.. పరుగో పరుగు
రాముడిని అవమానపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేయగా.. రాముని పేరుతో రాక్షస పనులు చేస్తే తమ కేడర్ చూస్తూ ఊరుకోదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. అంతకుముందు వారు ఎమ్మెల్యే చల్లా ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కాగా, హన్మకొండకు వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని ఆలేరులో, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను జనగామ బైపాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకుల ఇళ్లు, రెండు పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కేటీఆర్ ఆగ్రహం
44 మందికి రిమాండ్
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. తమ నాయకులను వదిలిపెట్టాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య హన్మకొండ కోర్టుకు తీసుకెళ్లారు. బీజేపీ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ సహా 44 మందిని సోమవారం కోర్టులో పరచగా.. న్యాయమూర్తి ఈనెల 15 వరకు రిమాండ్‌కు అదేశించారు. కాగా, ఈ కేసులో మరో 13 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment