ఎమ్మెల్యే భిక్షపతికి దక్కని చోటు
హైదరాబాద్ : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే భిక్షపతికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కొండా సురేఖకు వరంగల్ ఈస్ట్ సీటును కేటాయించారు. కాగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారికి కేసీఆర్ ఈసారి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తొలి జాబితాలో చోటు కల్పించారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనున్నారు.
అసెంబ్లీకి 69మంది అభ్యర్థుల తొలి జాబితాతో పాటు పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లతో పాటు మైనార్టీల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. పది జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా విస్తరిస్తామన్నారు.
వచ్చే అయిదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని, ప్రభుత్వ ఖర్చుతో అమరవీరులకు స్థూపాలు నిర్మిస్తామని తెలిపారు. లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, ఆటో రిక్షాలపై రవాణా పన్ను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నామన్నారు. వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తామని, ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని, బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించారు.