టీఆర్‌ఎస్‌లో చల్లా చేరిక నేడే..
పరకాల : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లాంఛనప్రాయంగా ఆదివార ం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో తరలివెళ్లి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 2వ తేదీనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించినప్పటికీ సీఎం ఛత్తీస్‌గఢ్ పర్యటన నేపథ్యంలో చేరిక తేదీ 9కి వాయిదా పడింది. దీంతో జనసమీకరణ కోసం టీడీపీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలు వేసి నాయకులు, కార్యకర్తల మధ్య సర్ధుబాటు చేశారు. నియోజకవర్గం నుంచి 15 వేల మందితో హైదరాబాద్‌కు కాన్వాయ్‌గా వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాల్లో 103 గ్రామాలుండగా 200 వాహనాలను సమకూర్చారు. టీడీపీ చెందిన ఒక జెడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు ఎంపీపీలు, 33మంది ఎంపీటీసీ సభ్యులు, 41మంది సర్పంచ్‌లతో పార్టీలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరకాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ ఇటు టీడీపీ, అటు టీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది.
ఆ ఇద్దరు నాయకులు తరచూ పార్టీ మారే అలవాటు ఉందని తమతో వచ్చి ఇందులో ఉంటారనే నమ్మకం లేదనే వాదనను ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఆయన వారి విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఎమ్మెల్యే వెంట నడిచేదెవరు..సొంతగూటిలోనే ఉండిపోయేది ఎవరో ఆదివారం మధ్యాహ్న కల్లా తేలిపోనుంది.