పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్ రూరల్ : ఇద్దరు తహసీల్దార్లపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు.
ఒక ఫైల్ విషయంలో చర్చించడానికి వచ్చిన ఎమ్మెల్యే.. కలెక్టరేట్ ఈ-సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్ జి.సదానందం, నర్సంపేట తహసీల్దారు ఫూల్‌సింగ్‌ను దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సంపేట తహసీల్దారు ఈ మొత్తం సంఘటనను వీడియో తీసినందుకు అతడిపై పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పానాదేవి భర్త పాడి ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే గన్‌మెన్ చేయి చేసుకున్నారని తెలిపారు.
ఈ విషయంలో కలెక్టరేట్ జీ-సెక్షన్ ఉద్యోగులు, సిబ్బంది సాక్షులుగా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నెక్కొండ తహసీల్దార్ విశ్వనారాయణ, రాయపర్తి తహసీల్దార్, ట్రెస్సా ఉపాధ్యక్షుడు రాంమూర్తి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పీఎస్.ఫణికుమార్ ఉన్నారు. కాగా, కలెక్టర్ హరితపై ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment