సిద్దిపేట జోన్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరయ్యే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల్లో 10/10 మార్కులు సాధించే విద్యార్థులకు ఆయన రూ.25 వేల నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ. 10 లక్షలతో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. గతేడాది పదో తరగతిలో 92 శాతం ఫలితాలతో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలవాలని టీచర్లకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో, అభివృద్ధిలో చివరికి ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందని.. అదే స్ఫూర్తితో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీచర్లకు సూచించారు. నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులు ఎంత మంది 10/10 ఫలితాలు తెచ్చుకుంటే అందరికీ రూ.25 వేల నజరానా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్లి టెన్త్ ఫలితాల్లో 10/10 సాధిస్తే రూ.25 వేలు బహుమానంగా ఇవ్వనున్నట్లు హరీశ్ తెలిపారు. తన ఛాలెం జ్‌ను స్వీకరించి 10/10 సాధించి నజరానా పొందాలని సవాల్ విసిరారు. దీనికి విద్యార్థులు సవాల్‌ను స్వీకరిస్తున్నామని విక్టరీ సంకేతంతో బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment