హైదరాబాద్: సకల వసతులతో నిర్మించిన కొత్త ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్ల సముదాయాన్ని సందర్శించారు. క్వార్టర్లలో సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుత శాసనసభలో మొత్తం 120 మంది సభ్యులుగా ఉన్నారు. సభ్యులకు అన్ని వసతులతో నివాసాన్ని కల్పించాలని, ఇక్కడ ఉన్న పాత క్వార్టర్లను తొలగించి కొత్త నివాసాలను నిర్మించాం.
మొత్తం 4.5 ఎకరాల్లో రూ.166 కోట్లతో 120 క్వార్టర్లను 12 అంతస్తులతో నిర్మాణం చేశాం. దీంతోపాటు 120 సర్వెంట్ క్వార్టర్లు, 36 స్టాఫ్ క్వార్టర్లను కూడా కట్టారు. ఇదే ప్రాంగణంలో క్లబ్ హౌస్, కార్యాలయం, సూపర్ మార్కెట్ కూడా నిర్మించారు. ప్రతి క్వార్టర్ 2,100 చదరపు అడుగులలో 3 బెడ్ రూంలతో ఉంది. 3 అంతస్తుల సెల్లార్‌లో 240 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో అతిథులతో సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదులు అందుబాటులో ఉన్నాయి. అన్ని నిర్మాణాలు పూర్తయి ప్రారంభో త్సవానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తాం. అంతకంటే ముందు ఓ కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సూచనలకు అనుగుణంగా సభ్యులకు క్వార్టర్లను కేటాయిస్తాం’’అని స్పీకర్ వివరించారు. స్పీకర్ వెంట అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహాచార్యులు, ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment