17వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే మార్క్ చేయాలి: జిల్లా ఎన్నికల అధికారి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న జరుగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు 17 సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కు మార్‌సింగ్‌తో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుందన్నారు.
బ్యాలెట్ పత్రాల ముద్రణ సోమవా రం రాత్రి వరకు పూర్తి అవుతుందన్నా రు. ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై తమ ప్రాధాన్యత ఓటును పోలింగ్ కేంద్రం లోని ప్రిసైడింగ్ అధికారి అందజేసే వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే మార్క్ చేయాలన్నారు. 17 సాయంత్రం 6 గంటల నుంచి 19 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్‌లు మూసివేయనున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపును చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.