పోటాపోటీగా టీచర్‌ ఎమ్మెల్సీ ప్రచారం | Mlc Election Campaigning At Peaks | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా టీచర్‌ ఎమ్మెల్సీ ప్రచారం

Published Tue, Mar 5 2019 3:00 PM | Last Updated on Tue, Mar 5 2019 3:06 PM

Mlc Election Campaigning At Peaks

విద్యారణ్యపురి: వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 22న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. 26న కౌంటింగ్‌ ఉంటుంది.  ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కలిపి 20,581  మంది ఓటర్లు ఉన్నారు. 

సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం..

ఓటరు నమోదు ప్రక్రియతోనే ప్రధాన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. నామినేషన్‌ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నామినేషన్‌ వేసిన ఆరుగురిలో ఐదుగురు మాత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారాని కి కరపత్రాలు సైతం ముద్రించి పంపిణీ చేస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియానూ వినియో గించుకుంటున్నారు. తమను గెలిపిస్తే విద్యారంగ, ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తామంటూ మెసేజ్‌లలో హామీ ఇస్తూ న్నారు.

ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను, ఆచార్యులను అభ్యర్థిస్తున్నారు. ఉన్నత పాఠశాలల  టీచర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు, యూనివర్సిటీల, నిట్‌ ఆచార్యులు, కాంట్రాక్టు లెక్చరర్లను ప్రత్యేకంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని కోరుతున్నారు.

రెండో సారి గెలవడానికి.. 

పూల రవీందర్‌  ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రెండో సారి కూడా గెలుపొందాలనే లక్ష్యంతో ప్రచారం లో దూసుకెళ్తున్నారు. తాను ఆరు సంవత్సరాలు గా ఎమ్మెల్సీ మోదాలో పలు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి అనేక జీవోలు తీసుకొచ్చినట్లు పేర్కొంటున్నాడు. మళ్లీ గెలిస్తే మిగితా సమస్యలను సైతం పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. 

విమర్శలే.. ఆయుధాలుగా..

పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, జనరల్‌ సెక్రటరీగా ఆరున్నర సంవత్సరాలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ అధ్యక్షుడిగా, జనరల్‌ సెక్రెటరీగా కొన్నేళ్లు సేవలంచిన పులి సరోత్తమ్‌రెడ్డి ఇప్పుడు ఎన్నికల బరిలో ఉన్నాడు. ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్‌పై విమర్శలనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు.

విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేయపోయరని, సీడీఎఫ్‌ నిధులు రూ.13కోట్ల 50లక్షలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు కేటాయించలేదని, అసలు అవి ఎక్కడెక్కడ ఖర్చుచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయాలను ఉపాధ్యాయుల్లోకి తీసుకెళ్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. 


పూల రవీందర్‌, పులి సరోత్తమ్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, సంగని మల్లేశ్వర్‌, వై.చంద్రమోహన్‌ 

ప్రశ్నించే వారినే ఎన్నుకోవాలి.. 

శాసన మండలి వేదికగా విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నించే వారినే ఎన్నుకోవాలని కోరుతూ టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్‌ మద్దతుతో ఎన్నికల బరిలో ఉన్న ఎ.నర్సిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదని, ఆరేళ్లుగా ఉన్న ఎమ్మెల్సీ కూడా శాసనమండలిలో ప్రశ్నించ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల గళం వినిపిస్తానని హామీ ఇస్తున్నారు. 

‘సంగాని’ విస్త్రృత పర్యటనలు..

ఎస్‌టీయూ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్‌ సంగాని మల్లేశ్వర్‌ ఎస్‌టీయూ బాధ్యులతో కలిసి జిల్లాలో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగం కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నందున యూనివర్సిటీ అధ్యాపకులను సైతం కలిసి ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే ఉన్నత పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తాను చేయబోయే సేవలను వివరిస్తున్నారు.

నామినేషన్‌ వేసిన అభ్యర్థులు.. 

వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన పూల రవీందర్‌ పీఆర్‌టీయూ అభ్యర్థిగా, హన్మకొండకు చెందిన పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తమ్‌రెడ్డి  వాలంటీర్‌ రిటైర్ట్‌మెంట్‌ తీసుకొని స్వతంత్య్ర అభ్యర్థిగా,  ఎస్‌టీయూ, టీపీటీఎఫ్‌ మరో పది సంఘాల మద్దతుతో నల్గొండ జిల్లాకు చెందిన ఎ.నర్సిరెడ్డి నామినేషన్‌ వేశారు.

ఎస్‌టీయూ అభ్యర్థిగా కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సంగని మల్లేశ్వర్,  ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ డీఈఓ వై.చంద్రమోహన్, సూర్యపేటకు చెందిన దుర్గం సూరయ్య స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుండడంతో మరో ఒకరిద్దరు  నామినేషన్లు వేస్తారని తెలిసింది. 

పూర్వ విద్యార్థులతో మమేకం...

ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాజీ డీఈఓ వై.చంద్రమోహన్‌ 16 సంవత్సరాల పాటు హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దీంతో పూర్వ విద్యార్థులైన ఉపాధ్యాయులను కలిసి తనను గెలిపించాలని కోరుతూ మద్ద తు దారులైన ఉపాధ్యాయులతో ప్రచారం చేస్తున్నారు.

అలాగే ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీఈఓగా, నల్గొండ జిల్లా డీఈఓ గాను పనిచేయటంతో ఆయా జిల్లాలోనూ ఉపాధ్యాయులతో ఉన్న పరిచ యారన్ని ఓట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక సూర్యపేటకు చెందిన దుర్గం సూరయ్య సైతం నామినేషన్‌ వేశారు. ప్రధాన అభ్యర్థుల మధ్య పోటాపోటీ ప్రచారంతో పోటీ రసవత్తరంగా మారనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement