సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజులా నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ మంచి ముగింపు ఇచ్చారన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ను నిర్వహించారు.
ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2009 నవంబర్ 29న చేసిన దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. 2014, 2018లో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతోందన్నారు.
ఉద్యమ నేతకు వందనం: కల్వకుంట్ల కవిత
కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్భంగా ఈ మేరకు తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌కు, ఆయన వెంట నడిచిన తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు. ప్రజలు కోరుకున్నప్పుడు తను వారి వెంట కేసీఆర్ ఉన్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త ఉత్తేజాన్నిచ్చింది’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, మంత్రులు దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా దీక్షా దివస్ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment