
దేశాన్ని ప్రథమస్థానంలో నిలపడమే మోడీ లక్ష్యం
ప్రపంచంలోనే భారత దేశాన్ని నెంబరు వన్‌గా మోడీ తీర్చిదిద్దుతారని, ఆ దిశగానే ప్రధాని పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు
కడెం : ప్రపంచంలోనే భారత దేశాన్ని నెంబరు వన్‌గా మోడీ తీర్చిదిద్దుతారని, ఆ దిశగానే ప్రధాని పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. కడెం మండలం బుట్టాపూరు పంచాయతీ పరిధి చెన్నూరు గ్రామంలోని ఆయన సమీప బంధువు రామారావు ఇంటికి ఆదివారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పోలవర ం ప్రాజెక్టు విషయంలో ఇటీవల కేంద్రం తీస్కున్న నిర్ణయంపై తెలంగాణలో కొందరు నిరసనలతో రాద్ధాంతం చేస్తున్నారని, ఇది తగదని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల విషయంలో అది తప్పుడు నిర్ణయం కాదని, దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. గంగానదిలో మాదిరిగానే గోదావరి నదిలో కూడా నౌకాయానం చేసే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతోందని, దీని ద్వారా ఎస్సారెస్పీ నుంచి కాకినాడ వరకు నాకాయానం ద్వారా 4వేల టన్నుల బరువు గల సరుకులను రవాణా చేసే సామర్థ్యం వస్తుందని పేర్కొన్నారు. సింగిల్‌విండో చైర్మన్ చుంచు భూమన్న, బుట్టాపూరు, గొడిసెర్యాల సర్పంచులు హన్మాగౌడ్, కె.రాజేశం, కాంగ్రెసు పార్టీ నాయకుడు బి.లక్ష్మీరాజం ఆయనను కలిసి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. ఆయన రాకతో పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఎస్సై టీవీ రావు ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలను ఖానాపూరు నుంచి చెన్నూరు దాకా రహదారిపై మొహరించారు. బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి వంతెనల వద్ద తనిఖీలు చేపట్టింది.