పల్లెగడపకు పరిశోధన ఫలాలు | Money laundering, riphilling LPG subsidy | Sakshi
Sakshi News home page

పల్లెగడపకు పరిశోధన ఫలాలు

Published Sun, Nov 30 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Money laundering, riphilling LPG subsidy

మహబూబ్‌నగర్ విద్యావిభాగం/పాలమూరు యూనివర్శిటీ: విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి.. పరిశోధన ఫలాలు పల్లెగడపకు చేరాలని నేషనల్ అసిస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్(నాక్) డెరైక్టర్ ప్రొఫెసర్ ఏఎన్.రాయ్ ఆకాంక్షించారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ప్రపంచదేశాలతో పోటీపడొచ్చని అభిప్రాయపడ్డారు. శనివారం పాలమూరు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన మొదటి స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు.

నాణ్యత ప్రమాణాలు లేని విద్య వల్ల ఎలాంటి ప్రయోజనమూ చేకూరడం లేదని.. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే విశ్వవిద్యాలయాలకు సరైన నిధులు రావడంలేదని గుర్తుచేశారు. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రమాణాలు పాటించేలా జిల్లా విశ్వవిద్యాలయాలు ఎదగాలన్నా రు. యూనివర్సిటీలకు సంబంధించి నా క్ ఏటా వంద వర్క్‌షాపులు నిర్వహిస్తుం దని, వాటిలో ప్రమాణాలు ఏవిధంగా పాటిస్తున్నారో తెలియజేస్తుందే తప్ప సౌకర్యాలు కల్పించే సంస్థ కాదన్నారు.  

 ప్రగతివైపు.. పీయూ అడుగులు
 అనంతరం పీయూ ఉపకులపతి జి.భాగ్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాలమూరు యూనివర్సిటీ(పీయూ) కేంద్ర బిందువుగా మారనుందని పీయూ ఉపకులపతి జి.భాగ్యనారాయణ ఉద్ఘాటించారు. ఆరేళ్లుగా పీయూ అభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.

వెనుకబడిన ఈ జిల్లాలో పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పీయూను మంజూరు చేసిందని గుర్తుచేశారు. యూనివర్శిటీ ప్రాంగణంలో 12ఎకరాాల్లో రూ. 3.7కోట్లతో అధునాతనమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామన్నారు. ఐదు కోర్సులతో ప్రారంభమైన పీయూ ప్రస్తుతం 17కోర్సులకు విస్తరించిందన్నారు. జిల్లావ్యాప్తంగా 142 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయని పేర్కొన్నారు.

అధ్యాపకుల కృషి అభినందనీయం
మైక్రోబయోలజీ, మాలిక్యూలర్ బయోలజీలో పరిశోధనలకు రూపం తెచ్చే వేదికగా పీయూను తీర్చిదిద్దడంలో ప్రిన్సిపాల్ పిండిపవన్‌కుమార్ చేసిన కృషి అభినందనీయమన్నారు. పీయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం కోఆర్డినేటర్ శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12న చేపట్టిన లార్జెస్ట్ బేర్ ఫూట్‌వాక్‌కు ప్రపంచ గిన్నిస్‌రికార్డు దక్కిందన్నారు. బీ ఫార్మసీ విద్యార్థులు జీ ప్యాట్‌లో అర్హత సాధించడాన్ని ఆయన అభినందించారు.  

ఈ విద్యాసంవత్సరం వనపర్తి, కొల్లాపూర్, గద్వాల పీజీ సెంటర్లను ప్రారంభించినట్లు వీసీ తెలిపారు. యూనివర్శిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాల భవనం, కామర్స్ మేనేజ్‌మెంట్, పురుషుల, మహిళా హాస్టళ్ల, పరిపాలన భవనాలు, గ్రంథాలయం, అకాడమిక్ బ్లాక్ ఫార్మసీ భవనాలను పూర్తిచేశామని వివ రించారు. పీయూ ప్రారంభం నుంచి రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్ కె.వెంకటాచలం యూనివర్శిటీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశాడని కొనియాడారు.

పీయూ ప్రిన్సిపాల్స్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈసీ మెంబర్లు, ప్రతిఒక్కరూ పీయూ అభ్యున్నతికి కృషిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం 53 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడ ల్స్, పట్టాలను న్యాక్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఏఎన్. రాయ్, పీయూ ఉపకులపతి జి.భాగ్యనారాయణ అందజేశారు.

కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శివరాజ్, పీయూ ప్రిన్సిపాల్ పిండి పవన్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.మధుసూదన్‌రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, ఈసీ సభ్యులు డాక్టర్ మనోజ, డాక్టర్ శ్యాముల్, శ్రీనివాసరావు తదిరులు పాల్గొన్నారు.

 నిరాశ పరిచిన గవర్నర్
 ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జరుగుతున్న స్నాతకోత్సవం ఎంతో ఉత్సాహంగా నిర్వహించాలని, అందుకు తగ్గట్టుగానే పీయూ అధికారులు ఏర్పాట్లు చేశారు. పాలమూరు విద్యార్థుల కల నెరవేరిన తొలి కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ రాకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలాఉండగా, గోల్డ్‌మెడల్స్ అందుకోవడానికి విద్యార్థితో పాటు తమ తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థితో పాటు ఒక్కరికి మాత్రమే ఆడిటోరియంలోకి ప్రవేశం ఉందన్న నిబంధన విధించడంతో ఒక్కరు మాత్రమే ఆడిటోరియంలోకి వెళ్లి మిగతావారు బయటి నుంచే కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎల్‌సీడీలను ఏర్పాటుచేశారు. నాక్ డెరైక్టర్ ఏఎన్.రాయ్, ఇతర అతిథులకు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ బహూకరణతో కార్యక్రమం ప్రారంభమైంది. అతిథుల ప్రసంగం అనంతరం జాతీయగీతాలాపనతో ముగిసింది.

 పీయూ అధికారులపై ఆగ్రహం
 మొదటి స్నాతకోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించలేదని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి పీయూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సైతం నిరాశగా కనిపించింది. కార్యక్రమానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకు వేదికపై అవకాశం కల్పించకుండా మునిసిపల్ చైర్‌పర్సన్‌కు అవకాశం కల్పించడంపై కొందరు చర్చించుకున్నారు.

కార్యక్రమంలో మధ్యలోనే వెళ్లిపోయారు. వచ్చిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులకు సౌకర్యాలు కల్పించడంలో పీయూ అధికారుల నిర్లక్ష్యం కొట్టుచ్చినట్లు కనిపించింది. సుమారు నాలుగు గంటల పాటు ఆడిటోరియంలో ఉన్న వారికి కనీసం తాగునీటిని కూడా ఏర్పాటుచేయలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement