సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలలోకి శనివారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత వాతావరణశాఖ ఈనెల 18, 19 తేదీల్లో ఈ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం సరిగ్గా అనుకున్న సమయానికి అండమాన్, నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లోకి రావడంతో మిగిలిన ప్రాంతాల్లోకి కూడా వాతావరణ శాఖ చెప్పినట్లుగానే వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్తంత ఆలస్యంగానే రానున్నాయి. ఆరో తేదీన కేరళలో ప్రవేశిస్తాయని, దీనికి నాలుగు రోజులు అటుఇటు తేదీల్లో ఎప్పుడైనా వచ్చే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.
ఆ తర్వాత 11వ తేదీన తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించినా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు తెలంగాణలో వడగాడ్పులు కొనసాగే అవకాశముంది. రాగల మూడు రోజులు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శనివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 44, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, హన్మకొండలలో 42, భద్రాచలం, ఖమ్మం, నల్లగొండల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment