సాక్షి, హైదరాబాద్ / విశాఖపట్నం: అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికితోడు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు ఇవి కొనసాగే అవకాశమున్నట్లు పేర్కొంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో ఒక మాదిరి వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. గత 24 గంటల్లో హైదరాబాద్‌లోని గోల్కొండలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇక చేవెళ్ల, వికారాబాద్‌లో 4 సెంటీమీటర్లు, రామాయంపేటలో 3, మద్దూరు, తాండూరు, సంగారెడ్డి, ములుగు, ధర్మాసాగర్, హకీంపేట్, బిక్నూర్, దుబ్బాక, జుక్కల్, మేడ్చల్‌లలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కావలి, ఆత్మకూరు, గూడూరుల్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, అవనిగడ్డలో 8, సత్యవీడులో 7, గరుగుబిల్లి, శ్రీహరికోట, వింజమూరు, మార్కాపురం, ఉదయగిరి, కాళహస్తి, తిరుపతిలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మరో రెండు రోజులు వర్షాలు
Published Fri, Nov 14 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement