
సాక్షి, హైదరాబాద్: బొగ్గు పరిశ్రమల యాజమాన్యాలు, జాతీయ కార్మిక సంఘాల మధ్య ఇటీవల కుదిరిన 10వ జాతీయ బొగ్గు కార్మికుల వేతనాల ఒప్పందం (ఎన్‌సీడబ్ల్యూఏ) అమలుకు కొంత సమయం పట్టే అవకాశముందని సింగరేణి బొగ్గు గనుల సంస్థ యాజమాన్యం తెలిపింది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం 2016 జూలై 1 నుంచి కార్మికులకు కొత్త వేజ్‌బోర్డు అమలు చేయాల్సి ఉంది. కాగా కొత్త వేజ్‌బోర్డు వేతనాల బకాయిల నుంచి రూ.51 వేలను దీపావళి సందర్భంగా కార్మికులకు అడ్వాన్స్‌గా చెల్లిస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మంగళవారం సింగరేణి కార్మికుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. కొత్త వేజ్‌బోర్డు వేతనాలు అమల్లోకి వచ్చినప్పుడు ఈ రూ.51 వేల అడ్వాన్స్‌ను మినహాయించుకుని మిగిలిన బకాయిలను కార్మికులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ గత నెల రోజుల్లో 3 పర్యాయాలు కార్మికులకు వివిధ రూపాల్లో చెల్లింపులు జరిపిందని.. దసరా అడ్వాన్స్‌గా రూ.120 కోట్లు, దీపావళి బోనస్‌గా రూ.336 కోట్లు, లాభాల బోనస్‌గా రూ.98.84 కోట్లు మొత్తం కలిపి రూ.554.84 కోట్లు చెల్లించిందని వివరించారు. తాజాగా కొత్త వేజ్‌బోర్డు వేతన బకాయిల నుంచి రూ.265 కోట్లను చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment