కాన్పుకెళితే.. కోతే..!
కాన్పుకెళితే.. కోతే..!
Published Sun, Mar 19 2017 6:23 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
► సుఖప్రసవానికి అవకాశం ఉన్నా.. ఆపరేషన్లు
► ప్రైవేట్ హాస్పిటళ్లలో పెరుగుతున్న డెలివరీలు
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుముఖం
► అరకొర వసతులు, సర్కారు వైద్యుల నిర్లక్ష్యమే కారణం
నల్లగొండ టౌన్ : కాన్పుల్లో 69 శాతం సిజేరియన్ ఆపరేషన్లు చేస్తూ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. సుఖ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నా.. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసి కాన్పులు చేయడం పరిపాటిగా మారింది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి గర్భిణిæ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించేలా చూడాలి.. తల్లీబిడ్డకు అవసరమైన వైద్య పరీక్షలు, సేవలను ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని , వ్యాధి నిరోధక టీకాలను అందించడం ద్వారా మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా తగ్గించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పథకం కింద వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు.
గర్భిణుల కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నది లక్ష్యం. కానీ.. ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తుంది. అదే స్థాయిలో రోజురోజుకూ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుతున్న ప్రసవాలు
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వసతులతోపాటు వైద్యులు, సిబ్బంది ప్రదర్శించే అలసత్యం కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. కాన్పులు కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పోతే వైద్యులు సరిగ్గా పట్టించుకోరనే భావన వారిలో నెలకొనడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఎక్కువ శాతం మహిళలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం చేరుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రసవాల కోసం వచ్చే వారి నుంచి వేలాది రూపాయలను వసూళ్లు చేస్తున్నారు. బీద, బిక్కి అనే తేడా లేకుండా వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్‌ల పేరుతోపాటు సుఖప్రసవం జరిగే అవకాశం ఉన్పప్పటికీ.. డబ్బులకు కక్కుర్తి పడి ఆపరేషన్లకు పూనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోదాడ , మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, భువనగిరి, హుజూర్‌నగర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల దందా జోరుగా సాగుతోంది. ఆపరేషన్‌తో పాటు ఇతర పరీక్షలు, రూము అద్దె ఇతర ఖర్చుల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు వారివారి స్థాయిని బట్టి దండుకుంటున్నాయి.
అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తే చర్యలు..
సిజేరియన్ ఆపరేషన్లు అవసరం లేకున్నా చేస్తే ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రిని సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నా యి. ఆ మేరకు మాత్రమే.. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి. ఐఎంఏ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో ఇదివరకే సమావేశం నిర్వహించి.. వివరించాం. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో అవగాహన కల్పిస్తున్నాం. సిజేరియన్లలో జిల్లా నాలుగో స్థానం ఉండడం ఆందోళన కలిగించే అం«శం. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటాం– డాక్టర్ భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్‌ఓ, నల్లగొండ
Advertisement