పాఠ్య పుస్తకాల్లో మాండలికం వినియోగంపై విద్యాశాఖ నిర్ణయం
తెలంగాణ భాషకు శైలీపత్రం రూపకల్పనపై సమావేశం
హైదరాబాద్: విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మార్పులకు సంబంధించి తెలంగాణలో ఎక్కువ మంది మాట్లాడే మాండలికాన్నే వినియోగించాలని ఈ అంశంపై వేసిన కమిటీలు, విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. పాఠ్యపుస్తకాల్లో మార్పులపై బుధవారం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో కమిటీల సభ్యులు, విద్యాశాఖ అధికారులు, నిపుణులు భేటీ అయి చర్చించారు. పాఠ్య పుస్తకాల్లో ఉపయోగించాల్సిన భాషపై శైలీ పత్రం రూపొందించాలని నిర్ణయించారు. దీనిని గురువారం జరిగే సమావేశంలో ఖరారు చేయనున్నారు. దీంతోపాటు పరామర్శ గ్రంథాలు, పుస్తకాల్లో వినియోగించే మాండలిక పదాల కోసం నిఘంటువులను రూపొందించాలని నిర్ణయించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు అధ్యయనం చేసి, తదుపరి చర్యలు చేపట్టేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని డీఎస్‌ఈ జగదీశ్వర్ వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా మార్పులతో కూడిన పుస్తకాల రచన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ క్రమం, పోరాట యోధుల చరిత్ర వంటి అంశాల పై పాఠాలు పొందుపరిచే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ శ్రీనివాసన్ పేర్కొన్నారు.
‘సంస్కృతి’ పాఠాలు!: తరగతుల వారీగా పుస్తకాల్లో ఉపయోగించే భాష, వాక్య నిర్మాణం తదితర అంశాలను తెలంగాణ శైలీ పత్రంలో పొందుపరుస్తారు. ప్రస్తుతమున్న పాఠ్యాంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాటిని పరిశీలించి.. అవసరం లేనివాటిని తొలగిస్తారు. తెలంగాణకు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను తెలంగాణ విద్యార్థులు సమర్థంగా ఎదుర్కొగలిగే రీతిలో పాఠాలను చేర్చుతారు. తెలంగాణ ఉద్యమం, జయశంకర్, కొండా లక్ష్మన్ బాపూజీ, కాళోజీ వంటి తెలంగాణ స్ఫూర్తిప్రదాతలు, కవులు, కళలు, కళాకారులు, తెలంగాణ గ్రామీణ జీవన విధానం, పండుగలు, వృత్తులకు సంబంధించిన ప్రత్యేక పాఠాలను పుస్తకాల్లో చేర్చుతారు. సాంఘిక శాస్త్రంలో పటాలు, చార్టులు, సమాచార పట్టికలు, గణాంకాలను మార్చుతారు.
ఎక్కువ మంది మాట్లాడే యాసే!
Published Thu, Oct 9 2014 1:17 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement