కలెక్టర్ శ్వేతామహంతి తల్లి స్మితామహంతితో కలెక్టర్ శ్వేతామహంతి
వనపర్తి : ‘నా విజయంలో అమ్మ పాత్ర కీలకమైంది. మా అమ్మకు మేమిద్దరం ఆడపిల్లలం. మాకు అన్నదమ్ముళ్లు లేరు. చిన్నతనం నుంచే అమ్మ ఉన్నత చదువులు కోసం మామ్మల్ని ఎంతో ప్రోత్సహించారు.’ అని కలెక్టర్ శ్వేతామహంతి తనకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లులందరికీ ఆమె మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మే మొదటి గురువు
ప్రతి ఒక్కరికీ మొదటి గురువు అమ్మ. మాట్లాడే మాటలు, నేర్చుకునే అక్షరాలను మొదట అమ్మే నేర్పిస్తారు. వారి ఆత్మధైర్యంతో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నా విషయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉన్నతమైంది. మా సిస్టర్ ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రతి మదర్స్‌డే కు మేమిద్దరం అమ్మకు స్పెషల్‌గా విషెష్ చెబుతాం. మా అమ్మ లాగే నాకూ ఇద్దరు ఆడపిల్లలు. మగ సంతానం కలగలేదన్న ఆలోచన ఏనాడూ కలగలేదు.
ఆడపిల్లలను ప్రోత్సహించాలి
ఆడ పిల్లలకు అమ్మ ప్రోత్సాహం చాలా ముఖ్యమైంది. ప్రతిపనిలో నీవు ఆడపిల్లవు! అన్న మాటను ప్రస్తావించకూడదు. ఆడ.. మగ అనే వ్యత్యాసం అనుభవాలు చిన్నతనం నుంచే మనస్సులోకి రానివ్వకుండా పిల్లలను పెంచాలి. సొసైటీలో ఎప్పుడూ ఆడపిల్ల అన్న చులకన భావానికి స్వస్తి చెప్పాలి. విద్యావంతులు ఈ విషయంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది.
అంతరాలు తొలగాలి..
ఎదుటివారు తప్పుచేసినా ఆడపిల్లను నిందించే సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ఆడపిల్ల లేకుండా సమాజమే లేదన్న విషయం గుర్తించాలి. ఆడ.. మగ అనే అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి. అవధుల్లేనిది అమ్మ ప్రేమ. మదర్స్ డే రోజున మీ అమ్మపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసేలా శుభాకాంక్షలు చెప్పండి.
Comments
Please login to add a commentAdd a comment