
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో తన గుండె బద్దలవుతోందని టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కన్నీటి పర్యంతమయ్యారు. హరికృష్ణ నివాసంలో ఆయన భౌతికకాయనికి నివాళులర్పించిన అనంతరం ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మోత్కుపల్లి మీడియాతో పంచుకున్నారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు 1982లో హరికృష్ణను తొలిసారి కలిసానని గుర్తు చేసుకున్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను కలవడానికి వెళ్లినపుడు హరికృష్ణ అక్కడే ఉన్నారని, ఆ సందర్భంగా కలిసానన్నారు. ఆనాడు నీతికి అవినీతికి జరిగిన ప్రజాసంరక్షణ పోరులో ఎన్టీఆర్ మార్పు కోసం తలపెట్టినటువంటి యుద్దంలో రథసారధిగా ఉన్న మహానాయకుడు హరికృష్ణ అని మోత్కుపల్లి కొనియాడారు.
రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్న అప్పటి పరిస్థితుల్లో కొన్ని వేల కిలోమీటర్లు రథాన్ని నడిపించి ఎన్టీఆర్‌గారి విజయానికి కృషి చేశారన్నారు. ఏ యుద్దానికైనా రథసారధి కావాలని, అలాంటి రథసారధి హరికృష్ణేనని తెలిపారు. తమంతా ఎమ్మెల్యేలు, మంత్రులు కావడానికి కారణం ఎన్టీఆర్ అని, ఆయనకు మద్దతుగా నిలిచింది మాత్రం హరికృష్ణ అని తెలిపారు. అన్ని రకాలుగా ఎన్టీఆర్‌ను మెప్పించారన్నారు. అలాంటి నేత మరణం బాధను కలిగిస్తోందన్నారు.
వాహనం నడపాల్సింది కాదు..
ఈ వయసులో ఆయన వాహనం నడపాల్సింది కాదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ఏ మానసిక ఒత్తిడికి లోనయ్యాడో.. ఏ దురదృష్టం వెంటాడిందో పాపం అంటూ మోత్కుపల్లి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇటీవల కుమారుడు కూడా మరణించాడని, అదే బాధతో ఉండి ఉంటాడని చెప్పారు. రాజకీయాల్లో కూడా కొంచెం వెనకకు జరిగినట్లు తెలుస్తోందని, దీంతోనే ఆయనకు మానసిక ఒత్తిడి నెలకున్నట్లు అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, శోకసంధ్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment