
రాబందుల్లా అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: రైతు రాజుగా బతకాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్ రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. అయితే రైతు సమన్వయ సమితులను అడ్డుకునేందుకు విపక్షాలు రాబందుల్లా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రతీ దానికి కోర్టు గుమ్మం తొక్కడం విపక్షాలకు పరిపాటిగా మారిందని, రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు కోర్టు చీవాట్లు పెట్టినా విపక్ష నేతలు సిగ్గు లేకుండా గవర్నర్‌ను కలిశారని మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల్లో సామాజిక న్యాయం పాటించామని, ఒక్కసారి జీవో 39ను మళ్ళీ చదువుకుంటే విపక్షాలకు మంచిదని హితవు పలికారు.