ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న సర్కార్
జీవో 39ని ఉపసంహరించుకోవాలి: గట్టు
షాద్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయ ని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీవో 39 ద్వారా ఏర్పాటు చేసిన రైతు కమిటీలలో అధికార పార్టీకి చెందినవారే ఉంటున్నారని, దీంతో కొందరికే లబ్ధి కలుగుతోందన్నారు. ఈ విధానంవల్ల అధికార పార్టీకి చెందిన వారికి, ఇతర రైతులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. జీవో39ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామసభలు నిర్వహించి పార్టీలకు, కులాలకు అతీతంగా రైతు కమిటీలు ఏర్పాటు చేయాల న్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్ల నిధిని కేటాయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. నేటి వరకు కిమ్మనకుండా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కోసం మూడు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేయడానికి వెనుకంజ వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారి వెంకటరమణ, రాష్ట్ర వైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, రాష్ట్ర నాయకులు విజేందర్‌రెడ్డి, రమాదేవి, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు శీలం శ్రీను పాల్గొన్నారు.