‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ఎంపీ పాటిల్ దాడి
ఆందోళనకు దిగిన జర్నలిస్టులు... చివరకు క్షమాపణ చెప్పిన పాటిల్
జహీరాబాద్: ఆలయంలో ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ చేయిచేసుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయానికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు వస్తున్నారనే సమాచారంతో జిల్లా ఫొటోగ్రాఫర్లు, మీడియా ప్రతినిధులు కవరేజీ కోసం శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. మంత్రి పర్యటన రద్దు కాగా, డిప్యూటీ స్పీకర్ ఆలయానికి వచ్చారు.
గర్భగుడిలోకి పట్టువస్త్రాలు సమర్పించేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి వస్తున్న క్రమంలో ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు. అక్కడే ఉన్న ఎంపీ బీబీ పాటిల్ ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. లోపలికి ఎందుకు వచ్చారు? పోలీసులెలా అనుమతించారు? అంటూ రుసరుస లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌పై చేయిచేసుకున్నారు. ఆగ్రహించిన జర్నలిస్టు లు ఆందోళనకు దిగారు. స్పందించిన డిప్యూటీ స్పీకర్ సారీ చెప్పారు. బయలుదేరి వెళ్లేందుకు ఎంపీ వాహనంలో కూర్చోగా జర్నలిస్టులు ఆయన వాహనం ముందు బైఠాయించారు. ఎంపీ అనుచరుల ఓవర్‌యాక్షన్‌తో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పాటిల్.. క్షమాపణ చెప్పడంతో మీడియా ప్రతినిధులు శాంతించారు.