
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు 47500 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్థేశించుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. పార్లమెంటులో మంగళవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కందుల కొనుగోల్లపై లేవనెత్తిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ పై వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో 2.07 లక్షల టన్నుల కంది ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. నాఫెడ్, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా మద్దతు ధరకు కందులను కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. క్వింటాకు రూ. 5800 చొప్పున కనీస మద్దతు ధర చెల్లిస్తున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.125 అధికంగా చెల్లిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 22 నాటికి 45500 మెట్రిక్ టన్నులను సేకరించామని చెప్పారు. తాజా అంచనాల మేరకు కందుల కొనుగోల్లను పెంచామని వెల్లడించారు. 51625 మెట్రిక్ టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుని, తగిన మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment