నన్ను వేధిస్తున్నారు.. న్యాయం చేయండి
* వరంగల్ ఎంపీ రాజయ్య కోడలు సారిక
హన్మకొండ, న్యూస్‌లైన్: తన భర్త మానసికంగా వేధిస్తూ.. ఏడాది వయసున్న కవల పిల్ల ల పోషణను పట్టించుకోవడం లేదని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆరోపించారు. ఆదివారం హన్మకొండలోని ఎంపీ ఇంట్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కష్టాలను వివరించారు. తాను, ఎంపీ రాజయ్య కొడుకు అనిల్ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నామని, మొదట్లో సఖ్యతగా ఉన్న తన భర్త తర్వాత మానసికంగా వేధించసాగాడని, అయితే అత్త మామలు సర్ది చెప్పడంతో అతనితో కలిసి ఉంటున్నానని వివరించారు.
తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మా ర్పు రాలేదని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసి సంపాదించిన సొమ్మంతా తన భర్తకే ఇచ్చానని, ఇప్పుడు పిల్లల పోషణ ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. కనీసం పాలడబ్బాలు, మందులు కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నానని వివరించారు.
వేధింపులపై హైదరాబాద్‌లో తాను కేసు పెట్టి ఇంటి కి వచ్చేలోగా తన పిల్లలను బయట వదిలివేసి వెళ్లారని, న్యాయం చేసేదాకా ఇక్కడే పోరాటం చేస్తానని చెప్పారు. తనను వేధించడం వల్లే కేసు పెట్టానని, ప్రభుత్వం, అధికారులను రాజకీయ పలుకుబడితో మేనేజ్ చేస్తున్నారని అన్నారు. న్యాయం చేయాలని, పిల్లల పోషణ, వారి చదువు, వైద్యం, రక్షణ బాధ్యతలకు తగిన హామీ ఇవ్వాలని కోరారు.