ఎంఆర్‌పీఎస్ ఆందోళన భగ్నం
జిల్లా వ్యాప్తంగా కట్టడి చేసిన పోలీసులు
సంగారెడ్డి జోన్: ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డిలో తల పెట్టిన పాదయాత్ర, ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో దళితులు దేవాలయంలోకి రాకుం డా కంచె వేసిన సర్పంచ్, ఇతరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, ఎంఆర్‌పీఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం ఉదయమే సంగారెడ్డి ఐబీకి చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.
సంగారెడ్డిలో కేవీపీఎస్ నాయకుడు అడివయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సడాకుల కృష్ణ, నవాజ్‌లను పోలీసులు ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామ దళితులు సంగారెడ్డికి వస్తున్న క్రమంలో పెద్దాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జోగిపేట, దుబ్బాక, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో కూడా పాదయాత్రకు వస్తున్న నాయకులను కట్టడిచేశారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న నాయకులను సంగారెడ్డిలోని ఐబీకి తీసుకువచ్చారు. మందకృష్ణ మాదిగతో పాటు నేతలతో జిల్లా అదనపు ఎస్పీ వెంకన్న చర్చలు జరిపారు. ఎల్లారం గ్రామంలో దళితులకు న్యాయంచేయాలని, సర్పంచ్‌ను అరెస్ట్ చేయాలని మందకృష్ణ మాదిగ తదితరులు ఎఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా మరో వారం రోజుల్లో న్యాయం చేస్తామని ఎఎస్పీ హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళన విరమించారు.
దోషుల్ని వదిలి మమ్మల్ని అరెస్టా!
సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: దళితులను అవమానించిన వారిని అరెస్టు చేయకుండా... న్యాయం చేయాలని కోరిన దళిత నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని మంద కృష్ణమాదిగ పోలీసులను ప్రశ్నించారు. దళితులను అవమానించినందుకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ఎస్పీ కార్యాలయం ముట్టడిని పోలీసులు భగ్నం చేసి, ఆందోళన చేపట్టిన నాయకులను అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహించారు. మందకృష్ణ మాట్లాడుతూ... సంఘటన జరిగిన వెంటనే తాను ఎల్లారం వెళ్లి, ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్ చేసినప్పుడు... నిందితులను వారంలో అరెస్టు చేస్తామని చెప్పారన్నారు.
పది రోజులు దాటినా వారిని పట్టుకోలేదని... అందుకు నిరసనగానే కేవీపీఎస్, ఎంఆర్‌పీఎస్, సీపీఎం ఆధ్వర్యంలో శాంతియుత ప్రదర్శన చేపట్టామన్నారు. నిందితులను వదిలేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. కాగా, కేసు దర్యాప్తులో ఉందని, వారంలో నిందితులపై చర్యలు తీసుకొంటామని ఏఎస్పీ వెంకన్న హామీ ఇచ్చారు. దీంతో ఎస్పీ కార్యాలయ ముట్టడిని ఈ నెల 21కి వాయిదా వేసినట్టు మందకృష్ణ తెలిపారు.