అవకాశం వస్తే..మరిన్ని శిఖరాలు ఎక్కేందుకు రెడీ
సూర్యాపేట : భవిష్యత్తులో అవకాశాలు వస్తే మరిన్ని శిఖరాలు ఎక్కేందుకు రెడీగా ఉన్నానని ఎవరెస్ట్ శిఖర అధిరోహికుడు సాధపల్లి ఆనంద్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆనంద్‌కుమార్ మార్గమధ్యలోని సూర్యాపేట పట్టణంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా గాయత్రి టవర్స్‌లో భారతీ సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆనంద్‌కుమార్, ఆయన తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ ఎవరెస్ట్ చివరి క్యాంపు చేరాలంటే రాత్రి పూట లోయల మధ్య నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు.
ఆ సమయంలో చాలా భయం వేసిందని ఆ సృ్మతులను గుర్తు చేసుకున్నారు. కొద్దిగా అదుపు తప్పినా కనీసం శవం కూడా దొరకని పరిస్థితి అన్నారు. ఓ సమయంలో కిందపడ్డామని, అయినా ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లానని తెలిపారు. ఎవరెస్ట్ చేరాక జాతీయ జెండా, తెలంగాణ జెండాలు ఎగరవేశానని పేర్కొన్నారు. ఎవరెస్ట్‌పై తెలంగాణజెండాను ఎగరవేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎవరెస్ట్ అధిరోహించడం గర్వంగా ఉందన్నారు. ఆత్మవిశ్వాసం, ధృడసంకల్పం ఉంటే పేదవారు దేనికీ తక్కువ కారని నిరూపించవచ్చునని తెలిపారు.
తిరిగి వస్తున్న సమయంలో రెండుమార్లు కిందపడ్డామని, తల్లిదండ్రులు, గురువులు, దేవుడి ఆశీర్వాదాలతో క్షేమంగా చేరుకున్నానని పేర్కొన్నారు. తాను భవిష్యత్తులో ఐపీఏఎస్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ ఆటోట్రాఫ్ కోసం విద్యార్థులు ఎగబడ్డారు. కార్యక్రమంలో మొరిశెట్టి శ్రీనివాస్, మిర్యాల రాంమూర్తి, దేవరశెట్టి ఉమారాణి, మొరిశెట్టి యోగి, సోమ రవి, అక్కెనపల్లి శ్రీనివాసాచారి, పుట్ట వెంకన్నగౌడ్, పోరెండ్ల సత్యం, జి.శంకరాచారి, వెంపటి రాధాకృష్ణ, అజయ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.