కల నిజమాయే..!
► జిల్లాకు నిమ్స్ తరహా ఆస్పత్రి
► ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యసేవలు
► కరీంనగర్ చుట్టూ స్థలాలపై దృష్టి
కరీంనగర్ హెల్త్ : జిల్లా ప్రజల కల నిజంకాబోతోంది. కరీంనగర్‌తోపాటు పరిసర ప్రాంతాల ప్రజల కు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాలో నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) తరహా ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని 350 పడకల ఆస్పత్రిని 500 పడకలకు మార్చడంతోపాటు కొత్తగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇంతేకాకుండా జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో మరో అడుగు ముందుకేసి 750 పడకలతో నిమ్స్ తరహాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఎం సూచనలతో ఆర్థికశాఖ 2017–18 బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
ప్రజల దరికి మెరుగైన వైద్యం
జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న ఆస్పత్రిని బాగుచేయడంతోపాటు రూ.10లక్షలతో ఐసీయూను ఏర్పాటు చేసింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 350 పడకల ఆస్పత్రికి తోడు 150 పడకల మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. అనంతరం కళాశాలతోపాటు 500 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆలోచింది.
స్థల సేకరణపై దృష్టి : ఆస్పత్రి ఏర్పాటుకు స్థలం సేకరణపై అధికారులు దృష్టి సారించా రు. కలెక్టరేట్ పక్కన గల హెలిప్యాడ్ స్థలం బాగుంటుందని గతంలోనే పరిశీలించారు.
అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనతో వీటిపై దృష్టిపెట్టలేదు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అధికారులు స్థలాన్వేషణలో పడ్డారు. కరీంనగర్‌తోపాటు చుట్టూ పరిసర గ్రామాల్లో అనువైన స్థలాలు ఉన్నాయి. కలెక్టరేట్ పక్కన హెలిప్యాడ్‌గ్రౌండ్‌తోపాటు శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన 40 ఎకరాల స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దాదాపు 500 ఎకరాలు ఉన్న డెయిరీకి చెందిన స్థలం, చింతకుంటలోని ఆయుష్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించిన స్థలాలు కూడా అనువైనవిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో హాస్పిటల్ నిర్మాణానికి అనువైన భూమితోపాటు బైపాస్‌రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి. నగరంలోని గోదాంగడ్డలోగల గోదాములకు భారీ వాహనాల రాకపోకలతోపాటు కిలోమీటర్ మేర చుట్టుపక్కల ఇళ్లలోకి లక్కపురుగులు వస్తున్నాయని వాటిని ఇక్కడి నుంచి తరలించాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ గోదాంలను తరలించి అక్కడ నిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.
అన్ని చికిత్సలూ ఇక్కడే
నిమ్స్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా తీవ్రమైన జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాలు జరిగి కొన ఊపిరితో ఉన్న వారిని సైతం బతికించుకునే అవకాశాలు ఉంటాయి. ప్రమాదకరమైన వ్యాధులు, ప్రమాదాలు జరిగినప్పుడు మనకు వరంగల్‌లోని గాంధీ హాస్పిటల్ లేదంటే హైదరాబాదే దిక్కు. ఇప్పుడు అలాంటి వాటికి కాలం చెల్లనుంది. దీర్ఘకాలిక షుగర్, కిడ్నీ, కాలేయం సంబంధిత వ్యాధులే కాకుండా గుండె ఆపరేషన్లు, ప్రమాదాలు జరిగినప్పుడు మెదడు, నరాలు, ఎముకల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి. హైదరాబాద్‌లో అందే వైద్యసేవలు కరీంనగర్‌లోనే అందుబాటులోకి రానున్నాయి.