వైరా: మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలపరిమితి జూలై మొదటి వారంతో ముగియనుంది. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణనను యంత్రాంగం పూర్తి చేసి.. తుది జాబితాను ప్రభుత్వానికి అందజేసింది. దీంతో రిజర్వేషన్లను తేల్చే పనిలో సర్కారు నిమగ్నమైంది. ఈ క్రమంలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే టెన్షన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో నెలకొంది.
జిల్లాలో మూడు మున్సిపాలిటీలు..
జిల్లాలో ప్రస్తుతం మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలు ఉండగా.. కొత్తగా వైరా మున్సిపాలిటీ ఏర్పడింది. ఈ మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటికే అధికారులు కులాలవారీగా ఓటర్ల గణనను పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. జూలై వరకు మున్సిపాలిటీల పాలక మండళ్లకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండడంతో.. వాటితోగానీ, రోజుల తేడాతోగానీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జూన్‌లోగా అన్ని రకాల ఎన్నికలను పూర్తి చేసుకొని వచ్చే నాలుగున్నరేళ్లు పాలనపై దృష్టి సారిస్తామని చెప్పడం ముందస్తు మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తారనే దానికి మరింత బలం చేకూర్చింది. అందుకోసమే మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.
మున్సిపాలిటీ యూనిట్‌గా..
కులాలవారీగా ఓటర్ల వివరాలను అధికారులు విడుదల చేశారు. అయితే ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించడమే మిగిలి ఉంది. మున్సిపాలిటీలవారీగా సేకరించిన ఓటర్ల వివరాల ఆధారంగా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వం చైర్మన్ పదవులను ఖరారు చేస్తుంది. కౌన్సిలర్ల రిజర్వేషన్లు మాత్రం మున్సిపాలిటీని యూనిట్‌గా తీసుకొని ఖరారు చేస్తారు. అయితే జనాభా, ఓటర్ల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. మున్సిపల్ ఎన్నికలు జరిగేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment