మున్సిపల్ కార్యాలయంలోని టీపీఎస్ కంప్యూటర్‌ను కిందపడేసిన దృశ్యం
సాక్షి, నిర్మల్: సమాచారం ఇవ్వకుండా ఓ దుకాణాన్ని తొలగించారంటూ నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ అలీమ్ సోమవారం వీరంగం సృష్టించారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని మౌసిన్ అనే వ్యక్తికి సంబంధించిన దుకాణాన్ని సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ అలీమ్ టీపీఎస్ ఉదయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఆయన టేబు ల్‌పైన ఉన్న కంప్యూటర్‌ను కింద పడేశారు. అనంతరం బయట గదిలో సిబ్బంది ఉపయోగిస్తున్న కంప్యూటర్‌నూ కింద పడేశారు. దీంతో రెండు కంప్యూటర్లూ దెబ్బతిన్నట్లు సిబ్బంది తెలిపారు.
ఆక్రమణల తొలగింపులో భాగంగా..
ఇటీవల జిల్లాకేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈక్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. బైల్‌బజార్ నుంచి కంచెరోని చెరువు వరకు ఉన్న ఫుట్‌పాత్ దుకాణాలను, తోపుడు బండ్లను తీయించేస్తున్నారు. ఎన్టీఆర్ మినీస్టేడియం వద్ద ఉన్న ఆక్రమణలను ఇటీవల తొలగించి, రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. దీనిపై స్థానిక వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు. సదరు స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకుండా యథాస్థితిని కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధం లేకుండా శనివారం రాత్రి వ్యాపారులు మళ్లీ తమ దుకాణాలను అదే స్థలంలో వేసుకున్నారు.
కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినా మళ్లీ దుకాణాలను పెట్టుకోవడంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం ఆక్రమణలను తొలగించి, చెట్లను నాటారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా బస్టాండ్ ఇన్‌గేట్ పక్కనే ఖాళీగా ఉన్న టేలాను మున్సిపల్ సిబ్బంది తీసేశారు. తనకు సంబంధించిన వ్యక్తి టేలాను తొలగించడంతో కౌన్సిలర్ అలీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. జరిగిన ఘటనపై టీపీఎస్ ఉదయ్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి కౌన్సిలర్ అలీమ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఇన్‌చార్జి కమిషనర్ సంతోష్ ధ్వంసమైన కంప్యూటర్లను పరిశీలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment