సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. వచ్చే జూలైతో పాలకవర్గాల గడువు ముగియనున్న మునిసిపాలిటీలతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పడిన 71 మునిసిపాలిటీలతో సహా మొత్తం 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన వాటిలో వార్డుల పునర్విభజన చేపట్టిన పురపాలక శాఖ..తాజాగా పురపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు షెడ్యూల్ జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బీసీ ఓటర్ల గుర్తింపునకు పురపాలక శాఖ ఆదేశించగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లను మాత్రం 76 మునిసిపాలిటీల్లో గుర్తించాలంది. వాటిల్లో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాలు జనవరి 9న ప్రకటించనున్నారు. అన్నీ జనవరి 10న కులాల వారీగా ఓటర్ల జాబితాలను పురపాలక శాఖకు సమర్పించాల్సి ఉండనుంది. 19 రోజుల షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించి ఓటర్ల గణన పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేయడంలో కులాల వారీగా ఓటర్ల గుర్తింపు కీలకం కానుంది. 2011 జనాభా గణాంకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల దామాషా లెక్కలను పరిగణనలోకి తీసుకుని మునిసిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్/మేయర్, కౌన్సిలర్/కార్పొరేటర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment