తహసీల్దార్ దేశ్యాకు రూ.లక్ష విరాళం అందజేస్తున్న కంచర్ల కృష్ణారెడ్డి
మునుగోడు: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని కుటుంబాలకైనా సాయం చేయాలనుకున్నారు మునుగోడు తహసీల్దార్ జి.దేశ్యా. తాను ఒక్కడినైతే కొద్దిమందికే చేయగలుగుతాను.. మరికొంతమంది తోడైతే చాలామందిని ఆదుకోవచ్చన్న ఆలోచనను స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో చర్చించారు. అందుకనుగుణంగా రెండు రోజులక్రితం ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి అందులో వారిని చేర్చారు. తన ఆలోచనను చెప్పి విరాళాలు ఆహ్వానించారు.
8 గంటలలోపే రూ.5 లక్షలకుపైగా పోగు
తహసీల్దార్ ఏర్పాటుచేసిన ఈ వాట్సాప్ గ్రూపులో చేరిన సామాన్య ప్రజలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తమవంతు సహాయంగా రూ. 500 నుంచి రూ.లక్ష వరకు అందించారు. 8 గంటల వ్యవధిలోనే 112మంది రూ.5లక్షలకు పైగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. మంగళవారం వరకు 152మంది విరాళాలు అందించగా రూ.6.50లక్షలు పోగయ్యాయి. ఆ నగదుతో మండలవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని 800 మంది అత్యంత పేద కుటుంబాలకు 15 రకాల నిత్యావసర వస్తువులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం చూపకుండా రెవెన్యూ అధికారులే చేస్తున్నారు. నిత్యావసరాలను బుధ లేదా గురువారం అందిస్తామని చెప్పారు. విషయం తెలిసిన చుట్టుపక్కల మండలాల ప్రజలు, అధికారులు తాము కూడా ఇదే పద్ధతిలో విరాళాలు అందజేసి పేదలకు అండగా ఉంటామని చెబుతున్నారు.
పేదలకు చేతనైన సాయం చేయాలి
లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి నా వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నా. అందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు తోడై మద్దతు తెలిపారు. మొత్తం విరాళాలు సేకరించారు. వాటితో రెండు రోజుల్లో ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి విలువగల నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తాం.
– జి.దేశ్యా, తహసీల్దార్, మునుగోడు
Comments
Please login to add a commentAdd a comment