
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బీజేపీ టికెట్ ఆశిస్తూ ఓ ముస్లిం మహిళ ముందుకు రావడంతో పాతబస్తీ అంతటా చర్చనీయాంశమయింది. మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇస్తే సత్తా చాటుతానంటూ బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు షహజాది పార్టీ అధిష్టానం వద్ద దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు విద్యార్థి విభాగంలో ఉన్న ఆమె ఇందుకోసమే పార్టీ కండువాను సైతం ధరించారు.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షహజాది బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీలో తొమ్మిదేళ్లుగా చురుగ్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ముస్లిం ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ముస్లింల సంక్షేమం గురించి పట్టించుకోని ఎంఐఎం పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు షహజాది ‘సాక్షి’కి తెలిపారు.
కాగా, ఎంఐఎం పార్టీతో టీఆర్‌ఎస్ అంటకాగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్టేనని ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్‌ను ఓడించగల సత్తా తమకే ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment