
నాలాలోంచి పొగలు
నల్లకుంట : నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా సమీపంలోని నాలా లోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందారు. నాగమయ్య కుంట నుంచి వచ్చే వరదనీరు, డ్రైనేజీ నీటిని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సమీపంలోని హుస్సేన్‌సాగర్ నాలాలో కలిపేందుకు బాక్స్ నాలా నిర్మించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి చౌరస్తా సమీపంలోని లారీల అడ్డా వద్ద నాలాలోంచి పొగలు రావడం ప్రారంభమైంది. అది చూసిన స్థానికులు నాలాలో చెత్త కాల్చి ఉంటారని అనుకున్నారు.
రాత్రి 7 గంటలకు పోగలు మరింతగా ఎక్కువయ్యాయి. అదే విధంగా పాత నల్లకుంట పాత రామాలయం వీధి, డాక్టర్ చారీలేన్‌లలో ఉన్న మ్యాన్ హోళ్లలోంచి కూడా పొగలు వచ్చాయి. అది చూసిన స్థానికులు ఇళ్లలోకి వెళ్లి చూడగా బాత్ రూమ్‌లలోని డ్రెనేజ్ పైపుల ద్వారా పోగలు వస్తుండడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారమందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు తార్నాకలోని అగ్నిమాపక కార్యాలయానికి సమాచారమందించారు. వెంటనే అగ్ని మాపక శకటంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో పరిశీలించగా అంతుచిక్కిలేదు.
భూగర్భ కేబుల్ కాలి పోగలు వచ్చి ఉంటాయా?
ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా మీదుగా అండర్ గ్రౌండ్ హై టెన్షన్ విద్యుత్ కేబులు, బీఎస్‌ఎన్‌ఎస్, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ ప్రాంతంలో భూగర్భ కేబులును వేశారు. ఇవి ఎక్కడైనా కాలిపోయాయా? లేదా నాలాలో ఎవరైనా గుర్తు తెలియని రసాయనాలు పోశారా అనేది తెలియరాలేదు. కాగా ఒక్క సారిగా పొగలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.