అమ్మో.. నల్లగొండ | Nalgonda Division Hot Topic | Sakshi
Sakshi News home page

అమ్మో.. నల్లగొండ

Published Wed, May 20 2015 12:21 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Nalgonda Division Hot Topic

నల్లగొండ
  విద్యుత్ శాఖ బదిలీల్లో నల్లగొండ డివిజన్ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ డివిజన్ పరిధిలోని నాలుగు సబ్‌డివిజన్‌ల ఏడీఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంట్లో నల్లగొండ, నల్లగొండ రూరల్, మునుగోడు, రామన్నపేట స్థానాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏడీఈలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ కానున్నారు. నల్లగొండ ఏడీఈగా పనిచేస్తున్న నాగిరెడ్డి హుజూర్‌నగర్ వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఏడీఈ సూర్యాపేట వేళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మిగిలిన స్థానాల్లో పనిచేస్తున్న ఏడీఈలు కూడా వేరొక ప్రాంతాలకు వెళ్లనున్నారు. చాలా కాలం తర్వాత బదిలీలు జరుగుతుండటంతో శాఖా పరంగా ఇదొక ప్రక్షాళన లాంటిదే. కానీ జిల్లా మొత్తం మీద నల్లగొండ డివిజన్ అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు.
 
 ఈ సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే మండలాల్లో కాంట్రాక్టర్ల బెదిరింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు మంచి ఆదాయం తెచ్చిపెట్టే డివిజన్ కావడంతో ఇక్కడ పోటీ ఒకింత ఎక్కువగానే ఉంటుంది. అయితే రామన్నపేట, నల్లగొండ సబ్ డివిజన్‌లలో అధికారులకు, ఏఈలకు మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారు. అయితే ఈ బదిలీల్లో ఇప్పటి వరకు పనిచేసిన వారందరికీ స్థాన చలనం కలుగుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు వ్యవహార శైలి, రాజకీయ ఒత్తిళ్లు యథావిధిగానే ఉంటాయన్న అభిప్రాయంతో ఈ డివిజన్‌కు కొత్తవారు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ఈ స్థానాలకు జిల్లాతో సంబంధం లేని కొత్త వ్యక్తులను హైదరాబాద్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 పైరవీల జోరు...
 ఈ నెల 8 తేదీన బదిలీల షెడ్యూల్ జారీ అయింది. తొలుత 15వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ మూడేళ్లుదాటిన ప్రతి ఒక్కరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలని చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా 5 వందల మంది వరకు బదిలీ కానున్నారు. ఎస్‌ఈ స్థాయిలోనే నాలుగు వందల మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బదిలీల ప్రక్రియను ఈ నెల 30 వరకు పొడిగించారు. బదిలీ అయిన ఉద్యోగులు, అధికారులు జూన్ 6 తేదీలోగా తమ ప్రాంతాలకు వెళ్లాలి. కాగా బదిలీల షెడ్యూల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం దేవరకొండ డివిజన్ పరిధిలో పనిచేసే లైన్‌మన్లు, అసిస్టెంట్ లైన్‌మన్లు, హెల్పర్ల బదిలీలు మాత్రమే పూర్తయ్యాయి.
 
 కానీ ఎస్‌ఈ స్థాయిలో చేయాల్సిన ఏడీఈలు, ఏఈలు, జూనియర్ అసిస్టెంట్లు, జేఏఓల బదిలీల కసరత్తు ఇంకా జరుగుతోంది. ఎస్‌ఈ కొత్త వారు కావడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏడీఈల విషయానికొస్తే...కోదాడ, బీబీనగర్, నకిరేకల్, రామన్నపేట సబ్ డివిజన్‌లు రెవెన్యూ కలిగిన ప్రాంతాలు కావడంతో ఇక్కడికి వచ్చేందుకు పోటీ ఎక్కుగానే ఉంది. ఏఈలు మిర్యాలగూడ రూరల్, కోదాడ రూరల్, టౌన్, చివ్వెంల, ఆత్మకూరు (ఎస్), చౌటుప్పుల్ మండలాల మీద కన్నేశారు. హైదరాబాద్ పరిధిలోకి వచ్చే కొండమడుగు ఏఈ స్థానానికే రాష్ట్ర వ్యాప్తంగా 74 మంది పోటీలో ఉంటే దాంట్లో మన జిల్లాకు చెందిన వారు కూడా ఉండటం విశేషం. ఇక ఎస్‌ఈ కంట్రోల్ ఉండే జిల్లా స్టోర్స్ కార్యాలయంలో ఏఈలుగా పనిచేసేందుకు కూడా పోటీ పడుతున్నారు. నాలుగు చేతులా సంపాదన ఉన్న ప్రాంతాలు కావడంతో విద్యుత్ శాఖ బదిలీలు రాజకీయ జోక్యంతో రసవత్తరంగా సాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement