కసితీరా.. | Nalgonda encounter: Police probing SIMI link of slain duo | Sakshi
Sakshi News home page

కసితీరా..

Published Sun, Apr 5 2015 2:07 AM | Last Updated on Tue, Oct 16 2018 8:50 PM

కసితీరా.. - Sakshi

కసితీరా..

సూర్యాపేట కాల్పుల ఘటన నిందితుల ఎన్‌కౌంటర్
 
 ఆ కార్బైనే పట్టించింది...

 సూర్యాపేట ఘటన నుంచి దుండగులు ఎత్తుకెళ్లిన సీఐ గన్‌మెన్ కార్బైన్ వారిని పట్టించింది. దానిని ఎలా ఉపయోగించాలో వారికి అర్థం కాలేదు. దానిని పట్టుకుని తిరుగుతున్నా.. ఎక్కడా  ఉపయోగించలేదు. అయినా ఎందుకైనా మంచిదనే ఆలోచనతో వారు దానిని వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. దర్గాలో ఓ వ్యక్తి చూసింది... ముదిరాజ్ కాలనీ స్థానికులు గుర్తుపట్టింది.. అనంతారంలో పోలీసులు వీరిని గుర్తించింది.. ఈ కార్బైన్ ద్వారానే. చాలా పొడవైన ఆయుధం కావడంతో వీరిని పోలీసులు గుర్తించేందుకు ఆ కార్బైనే ఉపయోగపడింది.
 
 మోత్కూరు మండలం జానకీపురంలో ఇద్దరు దుండగులను మట్టుబెట్టిన పోలీసులు  ‘ఆపరేషన్’లో పాణాలు కోల్పోయిన మరో పోలీస్‌కానిస్టేబుల్ నాగరాజును కాల్చిచంపిన దుండగులు ఎస్‌ఐ సిద్దయ్య, సీఐ బాలగంగిరెడ్డిలకూ గాయాలుసిద్దయ్యకు ఎల్బీనగర్ కామినేనిలో శస్త్రచికిత్స ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు సాగిన ఆపరేషన్‌అర్వపల్లి దర్గాలో తలదాచుకున్న దుండగులు?అక్కడినుంచి సమీపంలోని గుట్టల్లోకి... శనివారం ఉదయమే తప్పించుకునే యత్నం స్థానికుల సమాచారం మేరకు ఛేజ్ చేసిన పోలీసులు జానకీపురంలో కనిపించిన పోలీసులపై ఆకస్మిక దాడి తేరుకుని ముష్కరులను మట్టుబెట్టిన పోలీసులు ఎన్‌కౌంటర్‌లో అనిల్, రమేశ్, మధు, వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుళ్ల సాహసం

సిమి సంస్థతో సంబంధాలున్నాయంటున్న పోలీసులు  ఇద్దరే వ్యక్తులు... బక్కపలచగానే ఉన్నా గుండెల నిండా విధ్వంసమే...చూడడానికి అమాయకుల్లా కనిపిస్తున్నా ఆరితేరిన క్రిమినల్స్ వాళ్లు... ఏకంగా పోలీసులనే పాయింట్‌బ్లాంక్‌లో కాల్చడానికి వెనుకాడని కిరాతకులు.... మూడు రోజులుగా అటు జిల్లా పోలీసులు, ఇటు ప్రజల్లోనూ కలవరానికి కారకులయ్యారు.. రెండు రోజులు ఎక్కడికెళ్లారో తెలియరాలేదు కానీ.. శనివారం అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జేబుల్లో తుపాకులు... చేతిలో సూర్యాపేట పోలీసులనుంచి తీసుకెళ్లిన కార్బై న్... ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. అడ్డువచ్చిన పోలీసులను హతమార్చేందుకు యత్నించి తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వారి ఆటలు రెండున్నర గంటల కన్నా సాగలేదు. మన పోలీసులు ప్రాణాలకు తెగించి వారిని మట్టుబెట్టారు.. ఈ క్రమంలో మరో పోలీస్ బలయ్యాడు. ముష్కరులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అయినా ప్రాణాలను లెక్కచేయని పోలీసులు అత్యంత సాహసాన్ని ప్రదర్శించి వారిని కసితీరా కాల్చిచంపారు. దీంతో మూడు రోజులుగా ఎడతెగని సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ‘ఆపరేషన్ సూర్యాపేట’ సినిమా క్లైమాక్స్ ముగిసింది.
 
 మోత్కూరు/అర్వపల్లి/తిరుమలగిరి :  మోత్కూరు మండలం జానకీపురంలో సినీఫక్కీలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈనెల ఒకటో తేదీన సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి పరారైన నిందితులు హతమయ్యారు. వీరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అస్లాం అయూబ్, జాకీర్ బాదల్‌లుగా గుర్తించారు పోలీసులు. అయితే, ఘటనలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆత్మకూర్(ఎం) కానిస్టేబుల్ నాగరాజు చనిపోయాడు. ఆత్మకూరు (ఎం) ఎస్సై సిద్ధయ్య తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయనకు పొట్ట, మెదడు భాగంలో గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమయింది. రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డికి కూడా ఘటనలో స్వల్పగాయాలయ్యాయి. కానీ, ఎట్టకేలకు పోలీసులు వారిని కాల్చిచంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
 శనివారం ఏం జరిగింది?
 సూర్యాపేట బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిపి ఇద్దరు పోలీసులను చంపిన దుండగులు పరారీలో ఉన్నారు. గురు, శుక్రవారాల్లో వారు ఎక్కడ తలదాచుకున్నారో పోలీసులకు కూడా అంతుపట్టలేదు. అయితే, శుక్రవారం రాత్రి వారు అర్వపల్లిలోని ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గాకు వచ్చారన్న సమాచారం పోలీసులకు చేరింది. దర్గాలో ఉన్న ఓ వ్యక్తి దుండగుల వద్ద ఉన్న తుపాకులను చూసి వారిని ప్రశ్నించగా... సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులను చంపింది తామేనని ఆ వ్యక్తిని దుండగులు బెదిరించినట్టు సమాచారం. దీంతో ఆ వ్యక్తి నెమ్మదిగా బయటకు వచ్చి తనకు తెలిసిన హుజూర్‌నగర్ వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతను నేరుగా 100 నెంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని వెల్లడించాడు. దీంతో నేరుగా జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి అర్వపల్లి చేరుకున్న ఆయన దర్గాకు పోలీసులను పంపారు.
 
 అయితే, అంతకుముందే విషయాన్ని పసిగట్టిన దుండగులు నెమ్మదిగా అక్కడినుంచి తప్పించుకుని పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. దర్గాకు వెళ్లిన పోలీసులు ఎవరూ లేరని వెనక్కు వచ్చారు. వస్తూ ఇద్దరు అనుమానితులను తీసుకువచ్చినా, వారు భక్తులేనని తేలడంతో పంపించి వేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గుట్టల్లో తలదాచుకున్న దుండగులు శనివారం ఉదయం 5గంటలకు తమ వద్ద ఉన్న ఆయుధాలతో బయలు దేరారు. నేరుగా అర్వపల్లి మండల కేంద్రానికి కాలినడకన వచ్చి ముదిరాజ్ కాలనీ మీదుగా సీతారాంపురం వైపు వెళ్లారు. ముదిరాజ్ కాలనీ నుంచి వెళుతుండగా, అక్కడి స్థానికులకు అనుమానం వచ్చి ఓ మాజీ ప్రజాప్రతినిధికి సమాచారం ఇచ్చారు.
 
 అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తుంగతుర్తి సీఐ గంగారాం రంగంలోనికి దిగారు. ఓ ప్రైవేటు వాహనంలో తన సిబ్బందితో బయలుదేరారు. అర్వపల్లి నుంచి సీతారాంపురం వైపు వెళుతుండగా ఎస్సారెస్పీ కాల్వలో దుండగులున్నట్టు గుర్తించారు. వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. అయితే, ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత తుపాకీ పేలలేదని సమాచారం. దీంతో ఆయన కొంచెం వెనక్కు తగ్గారు. దీన్ని గమనించిన దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దుండగులు కాల్పులు జరపడంతో పోలీసులు నేరుగా సీతారాంపురం వైపు వెళ్లిపోయారు. పోలీసులు అటు వెళ్లిపోగానే దుండగులు కాల్వ బయటకు వచ్చి కాలినడకన అర్వపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. అప్పుడు పోలీసులకు తుపాకులు చూపిస్తూ బెదిరిస్తూనే వచ్చినట్టు సమాచారం.
 
 ఎరక్కపోయి... ఇరుక్కుపోయారు
 అయితే, చిర్రగూడూరు వద్ద దుండగులు కుడివైపునకు మళ్లడం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్లగానే వాగు వచ్చింది. ఆవాగులో ఉన్న ఇసుకలో బండి కదల్లేదు. దీంతో వారు ఆ బండిని అక్కడ వదిలేశారు. ఆ సమయానికే పోలీసులు, యువకులు అక్కడకు చేరుకున్నారు. దీంతో దుండగులు వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, వారు భయానికి లోనై చెట్లచాటుకు వెళ్లి దాక్కున్నారు. వెంటనే దుండగులు ఆ యువకులు తెచ్చిన వాహనాల్లో ఒక దాన్ని తీసుకుని జానకీపురం గ్రామంవైపునకు బయల్దేరారు. గ్రామానికి ఫర్లాంగు దూరం ఉండగానే వారికి ఓ ఎద్దుల బండి ఎదురైంది. ఆ ఎద్దుల బండి వెనుకే మృత్యుపాశంలా వచ్చింది పోలీసు వాహనం. ఆత్మకూర్ (ఎం) ఎస్‌ఐ సిద్ధ్దయ్య, తన సిబ్బందితో కలిసి దుండగులను వెతుకుతూ వస్తున్నారు.
 
 అయితే, ఎద్దులబండి చాటుగా ఆ వాహనం రావడంతో ఇరువర్గాలు ఒకరిని ఒకరు చూసుకోలేదు. పోలీసు వాహనం కనిపించగానే దుండగులు బైక్‌పైనుంచే కాల్పులు ప్రారంభించారు. ముందుగా డ్రైవర్ నాగరాజును గురిపెట్టి ఆయన నుదిటిపై కాల్చారు. దీంతో ఆయన మెదడు పగిలిపోయింది. అక్కడిక్కడే నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజును కాల్చిన బుల్లెట్ ఆయన తలను చీల్చుకుంటూ వాహనం వెనుక ఉన్న అద్దాలను పగులగొట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత ముందుసీట్లో ఉన్న ఎస్సై సిద్దయ్యను కాల్చారు. నాలుగురౌండ్లు ధనాధన్ కాల్చడంతో ఆయనకు తీవ్రరక్తస్రావమైంది. శరీరంలోకి 4 బుల్లెట్లు దూసుకుపోయాయి. వెంటనే దుండగులు బైక్ నుంచి దిగి వాహనం దగ్గరకు వచ్చా రు. పోలీసులను బెదిరించి వాహనాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆయుధాలు ఇచ్చేస్తే మిగిలిన వారిని వదిలేస్తామని చెప్పారు. ఆ సమయంలో మరో ముగ్గురు పోలీసు వాహనంలో ఉన్నారు. అక్కడే అసలు సీన్ స్టార్ట్ అయింది.
 
 సహచరులను కోల్పోయినా...
 దుండగులు కాల్పుల్లో అప్పటివరకు తమతో మాట్లాడిన సహచరులు చనిపోవడంతో వెనుక కూర్చున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు ఏం చేయాలో అంతుపట్టలేదు. తమ దగ్గరకు వస్తున్న దుండగులను ఎలా నిలువరించాలా అని ఆలోచిస్తున్న సమయంలో మధు అనే కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించాడు. ఆయుధాలిస్తాం రమ్మని దుండగులను దగ్గరకు పిలిచాడు. వారు వస్తుండగా తాను కూర్చున్న డోర్‌ను ఒక్క ఉదుటన తీసి గట్టిగా వారికేసి కొట్టాడు. దీంతో ఆ ఇద్దరూ పక్కనే ఉన్న కంప చెట్లలో పడిపోయారు. వెంటనే మధు వారిపై లాఘించి దూకాడు. ఇద్దరిని ఒడిసిపట్టుకుని పెద్ద ఎత్తున కేకలు పెట్టాడు.
 
 మిగిలిన పోలీసులు కేకలు పెట్టడంతో వెనుక వాహనంలో 5 మీటర్ల దూరంలోనే ఉన్న రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి వాహనం నుంచి దూకారు. వెంటనే తన తుపాకీతో వారిని కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే, దుండగులు మరోసారి సీఐపై కాల్పులు జరిపారు. అయితే, ఆ బుల్లెట్ సీఐ లాఠీని తగులుతూ వెళ్లిపోయింది. అప్పుడే సీఐ వాహనంలో ఉన్న వెంకటేశ్వర్లు అనే గన్‌మెన్ అలర్ట్ అయ్యాడు. సీఐ గన్‌మెన్ జానకిరాం దగ్గర ఉన్న కార్బైన్ తీసుకుని దుండగులపై గురిపెట్టి కాల్చాడు. ఆ కాల్పులకు దుండగులిద్దరూ హతమయ్యారు. దీంతో కరుడుగట్టిన నేరస్తుల ఖేల్ ఖతం అయింది. ప్రాణాలకు తెగించిన పోలీసులు అందరి అభినందనలు అందుకున్నారు.
 
 బండి లాక్కెళ్లారు
 అర్వపల్లి వరకు కాలినడకన వచ్చిన దుండగులు అక్కడ లింగయ్య అనే వ్యక్తి నుంచి వాహనాన్ని లాక్కున్నారు. అతనికి కార్బైన్ చూపించి బెదిరించి వాహనంపై వెళ్లిపోయారు. అర్వపల్లి నుంచి నేరుగా తిరుమలగిరికి బయల్దేరిన వారు మార్గమధ్యంలో ఫణిగిరి స్టేజి వద్ద దారిమళ్లారు. అక్కడి నుంచి ఈటూరు మీదుగా మోత్కూరు రోడ్డులో అనంతారం చేరుకున్నారు. మరి వాహనంలో పెట్రోల్ అయిపోయిందో ఏమో కానీ, అక్కడే రోడ్డుపై ఉన్న సుంకరి చంద్రమౌళి దుకాణంలో అరలీటర్ పెట్రోల్ పోయించుకున్నారు. ఆ సమయంలోనే మరో పోలీసు వాహనం వస్తున్న విషయాన్ని గమనించి తిరుమలగిరి వైపు వాహనాన్ని మలిపి పెట్రోల్ పోయించుకున్నారు.  వారు పెట్రోల్ పోయించుకుంటుండగానే తిరుమలగిరివైపు పోలీసు వాహనం వెళ్లిపోయింది. అయితే, వాహనంలో ఉన్న పోలీసులకు బండిపై ఉన్న కార్బైన్ మ్యాగ్జిన్ కనిపించింది.
 
 దీంతో పోలీసులు వాహనాన్ని ఆపారు. దీన్ని గమనించిన దుండగులు మోత్కూరు వైపు వాహనాన్ని మళ్లించారు. అప్పటివరకు గుడ్డలో కప్పి ఉన్న కార్బైన్‌ను తీసుకుని చేతికి తగిలించుకున్నారు. ఆ సమయంలో బండి దిగిన పోలీసులు తమ వద్ద ఆయుధాలు లేకపోవడంతో కర్రలు, రాళ్లు పట్టుకుని గ్రామస్తులు లోపలికి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ సమయంలో దుండగులు మోత్కూరు వైపు బయల్దేరారు. అది గమనించిన అనిల్, రమేశ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్న ఓ పల్సర్ వాహనం తీసుకుని వారిని వెంబడించారు. దుండగులు అనంతారం నుంచి ఓ రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత చిర్రగూడూరు వద్ద కుడివైపునకు జానకీపురం గ్రామంలోనికి ప్రవేశించారు. అయితే, పోలీసులు చిర్రగూడూరుకు చెందిన కొందరు యువకులకు విషయాన్ని చెప్పి వారితో కలిసి వాహనాలపై వెంబడించారు.
 
 వాహనం నిండా రక్తపు మరకలే
 ఘటనాస్థలంలో ఉన్న పోలీసు వాహనాన్ని పరిశీలిస్తే దాని నిండా రక్తపు మరకలే కనిపించాయి. డ్రైవర్ నాగరాజు కూర్చున్న చోటయితే ఆయన మెదడు పగిలి కొంత భాగం సీటుకు అంటుకుంది. ఎస్సై సిద్దయ్య కూర్చున్న సీటు రక్తంతో తడిచిపోయింది. ఆయన కాళ్ల కింద ఉన్న పేపర్లు రక్తపు ముద్దలయ్యాయి. వాహనం ముందు భాగంలో ఉన్న అద్దంపై మూడు రంధ్రాలు పడ్డాయి. మధ్య సీటులో ఓ వాచ్ పడి ఉంది. అది కూడా ఊడిపోయి ఉండడంతో పెనుగులాట ఏమైనా జరిగిందా అనే అనుమానం తలెత్తుతోంది. ఇక, నాగరాజు తల నుంచి వెనుక అద్దాన్ని బుల్లెట్ పగలగొట్టడంతో చివరి వరుసలో అన్నీ గాజుముక్కలే ఉన్నాయి. మొత్తంమీద ఎన్‌కౌంటర్ సీన్ చూడకపోయినా ఆ వాహనం చూసిన వారికి కళ్లకు కట్టినట్టు దాని తీవ్రత కనిపిస్తోంది.
 
 లెక్కలేని బుల్లెట్లు
 ఇక, దుండగులను పోలసు లు కాల్చిన తీరు చూస్తే కసితీరా కాల్చారని చెప్పుకోవచ్చు. వారి దేహమంతా కాల్చిన పోలీసులు తమ మనుషులను చంపిన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. పొట్టభాగంలో, ఛాతి వద్ద, నుదుటిపై, ముఖంపై, బుగ్గలపై కూడా కసితీర్చుకున్నారు. దుండగులిద్దరూ టీషర్టు, జీన్స్‌పాయింట్లే ధరించి బెల్టులు పెట్టుకుని ఉన్నారు.
 
 పేలని గన్ను
 అర్వపల్లి సమీపంలో తుంగతుర్తి సీఐ గంగారాం ఆ ఇద్దరు దుండగులపై కాల్పులు జరిపి నా వారు చనిపోలేదు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపినా అవి వారికి తగల్లేదు. అప్పటికే గన్ పేలడం ఆగిపోయింది.. దీంతో పోలీసులు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మరోసారి అనంతారంలో పోలీసులకు తారసపడినా వారి వద్ద ఆయుధాలు లేకపోవడంతో వారు కూడా వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
 
 మరోసారి ఉలికిపాటు
 సూర్యాపేట కాల్పుల ఘటన కళ్లముందు కదులాడుతుండగానే మరోసారి జిల్లా ఉలికిపాటుకు గురయింది. జానకీపురం శివార్లలో మోగిన తూటాల చప్పుళ్లు మరోసారి ప్రజలను కలవరానికి గురిచేశాయి. తమ దరిదాపుల్లోకి రారని అనుకున్న వారు ఏకంగా తమ ఊర్ల గుండానే వెళ్లారనే సమాచారం తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా అర్వపల్లి, అనంతారం, జానకీపురం గ్రామాల్లో అయితే ప్రజలు తీవ్రంగా కలత చెందారు. చిర్రగూడూరుకు చెందిన యువకులు సాహసోపేతంగా పోలీసులకు సహకరించడం ఎంతైనా అభినందనీయమే. మొత్తంమీద మరోసారి కాల్పులు మోతలు జిల్లా ప్రజలను కలవరపెట్టాయి.
 
 నంబర్ ‘2’తో ఘటనకు ప్రత్యేక అనుబంధం
 గత బుధవారం అర్ధరాత్రి అంటే ఏప్రిల్ 2వ తేదీన సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో కాల్పులు జరిగిన తర్వాత ఇద్దరు దుండగులు హతమయ్యేంతవరకు ఈ ఘటనకు, నంబర్ ‘2’కు ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు అర్థమవుతోంది. ఎందుకంటే చనిపోయే రోజు దుండగులు ప్రయాణించింది 22 కిలోమీటర్లు...వాళ్లు ఇద్దరు వ్యక్తులు... రెండుసార్లు పోలీసుల కంటపడి తప్పించుకున్నారు. రెండు రౌండ్లు కాల్పలు జరిపారు. సూర్యాపేటలో ఇద్దరిని చంపి రెండు రోజులు తప్పించుకు తిరిగారు. చనిపోయిన రోజు కూడా ఇద్దరు పోలీసులను టార్గెట్ చేశారు. అందులో ఒకరు చనిపోతే, మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. మోత్కూరు పోలీసు బృందంలో నిందితులను పట్టుకునేందుకు సాహసం చేసింది ఇద్దరు కానిస్టేబుళ్లే. ఘటనాస్థలిలో ధైర్యసాహసాలు ప్రదర్శించిందీ ఇద్దరు కానిస్టేబుళ్లే.
 
 కొత్త కోణం... ఉగ్రవాదం
 అయితే, ఇప్పటివరకు సూర్యాపేట ఘటనకు పాల్పడింది అంతర్‌రాష్ట్ర దొంగలముఠా అయి ఉంటుందని, లేదంటే సుపారీలు తీసుకుని హత్యలు చేసేవారయి ఉంటారని అందరూ భావిస్తున్న తరుణంలో వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కొత్త కోణం వెలుగులోనికి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరికి దేశవ్యాప్తంగా పలు కేసుల్లో సంబంధాలున్నట్టు పోలీసు విచారణలో తేలుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement