నల్లగొండకు ‘నలుగురు’ | Nalgonda 'four' | Sakshi
Sakshi News home page

నల్లగొండకు ‘నలుగురు’

Published Mon, Apr 6 2015 2:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Nalgonda 'four'

  • సూర్యాపేటలో బస్సు దిగింది ఇద్దరు కాదు.. ముగ్గురు
  • పోలీసులు అనుమానించకపోవడంతో జారుకున్న మూడో వ్యక్తి
  • సీసీ టీవీ ఫుటేజీలో తేలిన వైనం..
  • ఇద్దరు దుండగుల నుంచి ల్యాప్‌టాప్ తీసుకెళ్లినట్లు అనుమానం
  • కూంబింగ్‌లో దొరికిన బ్యాగ్.. మూడు సెల్‌ఫోన్లు లభ్యం!
  • సమాచారాన్ని విశ్లేషిస్తున్న ఐబీ బృందం
  • సాక్షి ప్రత్యేక ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్‌కౌంటర్ ఘటనలకు మధ్య కాలంలో నల్లగొండ జిల్లాలోకి నలుగురు దుండగులు ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యాపేట బస్టాండ్‌లో బస్సులో నుంచి దిగింది ఇద్దరు కాదని, ముగ్గురని పోలీసులంటున్నారు. ఈ విషయం సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా తేలిందని చెబుతున్నారు. పోలీసులు  ఇద్దరినే అనుమానించి కిందకు దింపడంతో మూడో వ్యక్తి చడీచప్పుడు చేయకుండా బస్టాండ్ నుంచి బయటకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

    సీఐ మొగిలయ్య బృందంపై కాల్పులు జరిపిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న హైదరాబాద్ స్టాప్ నుంచి అతను బయటకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు దుండగులతో అతను కలవలేదని దర్యాప్తులో తేలుతోంది. ముగ్గురు సిమీ ఉగ్రవాదులు తెలంగాణలో ప్రవేశించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవలే పోలీసులను హెచ్చరించడం కూడా ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. మరోవైపు ఈ ముగ్గురికి తోడు ఇంకో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చినట్లు ఎన్‌కౌంటర్ స్థలంలో లభించిన రైల్వే టికెట్ ద్వారా తెలుస్తోంది. అంటే మొత్తం నలుగురు వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించారన్నమాట! అందులో ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో హతమవగా, మరో ఇద్దరు ఎక్కడున్నారనేది అంతుపట్టడం లేదు.  
     
    వెలుగులోకి అనేక విషయాలు

    ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన దుండగులకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఘటనపై పలు దర్యాప్తు సంస్థల విచారణలో ఈ వివరాలు బయటపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సూర్యాపేట కాల్పుల సందర్భంగా పోలీసుల నుంచి ఎత్తుకెళ్లిన కార్బైన్ నుంచి దుండగులు 19 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. బస్టాండ్ ఘటన తర్వాత నాలుగు సార్లు కాల్పులు జరిగాయి. బస్టాండ్ బయట ఓ కారుపై, ఆ తర్వాత అర్వపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ వద్ద తుంగతుర్తి సీఐపై, ఆ తర్వాత జానకీపురం సమీపంలోని ఇసుక దిబ్బల్లో స్థానికులు, పోలీసులపై.. చివరిగా, ఎన్‌కౌంటర్ స్పాట్‌లో కాల్పులు జరిపారు.

    ఈ నాలుగుసార్లు తమ వద్ద ఉన్న తుపాకులతో పాటు కార్బైన్ నుంచి కూడా 19 రౌండ్లు కాల్చారంటే వారు ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారో అర్థమవుతోంది. బైక్ నడుపుతున్న దుండగుడి నడుము చుట్టూ ప్రత్యేక పౌచ్ ఉందని, అందులో దాదాపు 30 రౌండ్ల బుల్లెట్లున్నాయని సమాచారం. కాగా, సూర్యాపేట బస్టాండ్‌లో లభించిన ఒడిశా రాష్ట్ర గుర్తింపు కార్డుపై కూడా పలు వాదనలు వినిపిస్తున్నాయి. వీరు గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా అడవుల్లో జరిగిన ఉగ్రవాద శిక్షణ శిబిరానికి హాజరయ్యారని, అప్పుడే ఆ రాష్ట్రంలో ఈ కార్డు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

    లేదంటే రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల నుంచి పర్సులు కొట్టేస్తుంటారని, వాటిలో లభించే గుర్తింపు కార్డులను అవసరం మేరకు ఉపయోగించుకుంటారని కూడా భావిస్తున్నారు. కాగా, దుండగులకు చెందిన ఓ బ్యాగ్ దొరికినట్లు సమాచారం. అయితే, ఇది ఘటనా స్థలంలో కాకుండా కూంబింగ్ జరుపుతున్నప్పుడు దొరికినట్లు తెలుస్తోంది. అందులో మూడు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయని, వాటిలోని సమాచారాన్ని ఐబీ అధికారులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. అయితే, బ్యాగ్‌లో కొన్ని వస్తువులు మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

    సూర్యాపేట బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో లభించిన దృశ్యాల ప్రకారం బస్సు దిగుతున్నప్పుడు దుండగుల్లో ఒకడు పెద్ద బ్యాగును తీసుకెళ్లాడు. అందులో ల్యాప్‌టాప్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ను మహారాష్ట్రలోని పూణెలో కొనుగోలు చేసినట్టు సమాచారం. కానీ, కూంబింగ్‌లో దొరికిన బ్యాగ్‌లో మాత్రం ల్యాప్‌టాప్ లేకపోవడం గమనార్హం. ఈ ల్యాప్‌టాప్‌ను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చేసి పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement