మంగళవారం నల్లగొండ - వరంగల్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికారుద్దీన్
►వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మృతి
►జాతీయ రహదారిపై ఎస్కార్ట్ బస్సులోనే కాల్పులు
►వరంగల్ జైలునుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్తుండగా ఘటన
►పోలీసులపై దాడికి యత్నించిన వికార్ గ్యాంగ్
►ఆయుధాలు లాక్కుని ఎదురుదాడి చేసే యత్నం..
►నిందితులను కాల్చి చంపిన పోలీసులు
►వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నేడు పోస్ట్‌మార్టం
►అన్యాయంగా చంపారు.. సీబీఐ దర్యాప్తు జరపాలి: వికార్ తండ్రి
►ఇది పోలీసుల ప్రతీకార హత్య: అసదుద్దీన్ ఒవైసీ
►హైకోర్టు జడ్జితో విచారణకు హక్కుల సంఘాల డిమాండ్
నల్లగొండ-వరంగల్ జిల్లా సరిహద్దులో ఎన్‌కౌంటర్
వరంగల్: రాష్ట్రంలో మరో సంచలనం. ఇద్దరు సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ను మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈసారి కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌తోపాటు అతని గ్యాంగ్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని టంగుటూరు శివారులో జాతీయ రహదారిపైనే మంగళవారం కాల్పు లు జరిగాయి. ఇందులో వికార్ అహ్మద్(29) అలియాస్ వికారుద్దీన్‌తోపాటు సయ్యద్ అమ్జద్(23), ఇజార్ ఖాన్(29), మహమ్మద్ జకీర్(32), మహమ్మద్ హనీఫ్(34) మృతి చెందా రు. పలు ఉగ్రవాద నేరాల్లో విచారణ ఖైదీలుగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న వీరిని కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. మూత్రవిసర్జన కోసమంటూ వాహనాన్ని నిలిపేలా చేసి ఉగ్రవాదులు పోలీసులపైకి తిరగబడ్డారని పోలీ సులు తెలిపారు. ఆయుధాలను లాక్కునేం దుకు యత్నించడంతో పోలీసుల కాల్పుల్లో నిందితులంతా అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాలన్నీ ఎస్కార్ట్ వాహనంలోనే పడి ఉన్నాయి. చేతులకు బేడీలు అలానే ఉన్నాయి. ఓ నిందితుడి చేతిలో మాత్రం పోలీసుల ఆయుధం ఉంది. ఒకేసారి ఐదుగురు ఉగ్రవాదులు హతమవడం రాష్ర్టంలో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇజార్‌ఖాన్ మినహా మిగతా వారంతా హైదరాబాద్ వాసులే. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు నిషేధిత సిమి, లష్కరేతొయిబా ఉగ్రవాద సంస్థలతో వికార్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తన కుమారుడిని అన్యాయంగా చంపారని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వికారుద్దీన్ తండ్రి అహ్మద్ డిమాండ్ చేశారు. ఇవి పోలీసుల ప్రతీకార హత్యలని, దీనిపై మానవ హక్కుల సంఘంతో విచారణ జరిపించాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఎన్‌కౌంటర్ చట్ట విరుద్ధమని, హైకోర్టు జడ్జితో విచారణ చేయాలని హక్కుల సంఘాలు మండిపడ్డాయి.
హైవేపైనే ఘటన..
పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు ఆర్ముడ్ రిజర్వ్(ఏఆర్) సబ్ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని పోలీసుల బృందం మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఐదుగురు ఖైదీలను తీసుకుని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి నీలం రంగు ఐషర్ వ్యానులో హైదరాబాద్‌కు బయలుదేరింది. పలు ఉగ్రవాద నేరాల్లో నిందితులుగా ఉన్న వికార్ గ్యాంగ్‌ను విచారణ నిమిత్తం నాంపల్లి ఏడో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. బస్సులో వికారుద్దీన్, సయ్యద్ అమ్జద్, ఇజార్ ఖాన్, మహమ్మద్ జకీర్, మహమ్మద్ హనీఫ్‌తోపాటు వీరికి బందోబస్తుగా డ్రైవర్ సహా 13 మంది ఏఆర్ పోలీసులు ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ మీదుగా వరంగల్ జిల్లా సరిహద్దు దాటి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాక 10.20 గంటల సమయంలో నల్లగొండ జిల్లా ఆలేరు మండలం టంగుటూరు శివారుకు చేరుకోగానే మూత్రవిసర్జన చేస్తామని ఉగ్రవాదులు చెప్పారు. దీంతో పోలీసులు బస్సును నిలిపి వారిని కిందకు దిగమన్నారు. ఇదే సమయంలో పోలీసులపై వారు తిరగబడ్డారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వికారుద్దీన్‌తో పాటు మిగతా నిందితులు పోలీసుల వద్ద ఉన్న తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. వెంటనే తేరుకున్న పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. 10.30 గంటల సమయంలో ఐదుగురు ఉగ్రవాదులూ చనిపోయారు. ఈ ఘటనలో ఆర్‌ఎస్‌ఐ సోమన్న గాయపడినట్లు ఐజీ నవీన్ చంద్ వివరించారు.
అందరి కళ్లు ఇక్కడే..
సూర్యాపేట కాల్పులు, జానకీపురం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు, ఉగ్రవాద నిరోధక బృందాల(ఏటీఎస్) అధికారులు టంగుటూరు ఎన్‌కౌంటర్ ప్రదేశానికి వచ్చారు. సెంట్రల్ కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూ రో, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టైస్ట్ స్క్వాడ్ బృందాలు, ఫోరెన్సిక్ బృం దం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. పోలీసుల నుంచి వివరాలు సేకరించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. మృతదేహాలను జనగామ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించడంతో జాతీయ రహదారిపై కల్వర్టులను బాంబ్‌స్క్వాడ్‌లు ముందుగా తనిఖీ చేశాయి.
భారీగా ట్రాఫిక్ జామ్
జాతీయ రహదారిపైనే ఎన్‌కౌంటర్ జరగడంతో కొన్ని గంటలపాటు వరంగల్-హైదరాబాద్ మధ్య రాకపోకలన్నీ ఆగిపోయాయి. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులకు తోడు సాధారణ జనం కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు హైదరాబాద్ మీదుగా వచ్చే వాహనాలను ఆలేరు వద్ద కొద్దిసేపు నిలిపివేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన మూడు గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించింది. జనగామ-సిద్ధిపేట రహదారిని ఆనుకుని ఈ ఆసుపత్రి ఉంది. జనం భారీగా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు, అధికారులు, ఆస్పత్రికి వచ్చిపోయే రోగులతో ఆసుపత్రి ప్రాంగణం సాయంత్రం వరకు కిక్కిరిసిపోయింది.
వ్యానులోనే మృతదేహాలు
ఎన్‌కౌంటర్‌తో ఐదుగురి మృతదేహాలు వాహనంలోనే చెల్లాచెదురుగా పడ్డాయి. ముగ్గురు నిందితులు సీట్లలోనే కూర్చున్నట్లుగా ఉండగా.. ఇద్దరు సీట్ల మధ్యన కిందపడిపోయి ఉన్నారు. ఎస్కార్ట్ వాహనమంతా రక్తపు మడుగుగా మారిం ది. బస్సులోంచి రక్తం ధారగా కిందకు కారింది. వాహనం కింద నేల కూడా రక్తం తో తడిసిపోయింది. వాహనం నిలిపిన ప్రదేశంలో మూడు చోట్ల రక్తపు మరకలు కనిపించాయి. పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను జనగామ ప్రాంతీ య ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నల్లగొండ జిల్లా పరిధిలో ఉండటంతో పోస్టుమార్టం ఎక్కడ నిర్వహించాలనే విషయంలో పోలీసులు కొంత ఆలోచించారు. భువనగిరికి తీసుకెళ్లాలని మొదట భావించినప్పటికీ అది దూరం కావడంతో చివరకు జనగామకే మృతదేహాలను తరలించారు. అయితే అక్కడ కూ డా ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.