కార్డన్ సెర్చ్‌లో పోలీసులకు సూచనలు చేస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి
చౌటుప్పల్ (మునుగోడు) : చౌటుప్పల్ మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి నాయకత్వంలో 150మంది పోలీసులు 10బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బుడిగ జంగాల కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత గుర్తింపు కార్డులు, వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి తనిఖీలు చేస్తుండడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులంతా ఇండ్లల్లోకి ఎందుకు వచ్చారో తెలియక మొదట ఆందోళన చెందారు.
గంజాయి స్వాధీనం
పోలీసుల కార్డన్ సెర్చ్‌లో కుంబ శ్రీరాములు ఇంట్లో అరకిలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ధైర్యంగా గంజాయిని ఇంట్లో నిలువచేసుకోవడం పట్ల పోలీసులు విస్తుపోయారు. శ్రీరాములును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అదే విధంగా సరైన పత్రాలు లేని 42ద్విచక్రవాహనాలు, 1కారు, 3ఆటోలు, 1సిలిండర్ పట్టుబడ్డాయి. కాలనీ పరిసరాల్లో మద్యం అమ్మే ముగ్గురు బెల్టు షాపు దుకాణాదారులను అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా మరో ఐదుగురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
నేరస్తులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకే : డీసీపీ
ఈ ప్రాంతంలో ఇటీవల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులు మండల కేంద్రంలోనే సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందింది. అందులో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు కార్డన్ సెర్చ్ దోహదపడుతుందన్నారు. పాత, కొత్త నేరస్తుల గుండెల్లో గుబులు పుడుతుందని తెలిపారు. ప్రజలంతా సరైన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనాల ఒర్జినల్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏసీపీలు రామోజు రమేష్, శ్రీనివాసాచార్యులు, స్థానిక సీఐ వెంకటయ్య, ఎస్సై చిల్లా సాయిలు, వివిధ మండలాల సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేటలో 40 ద్విచక్రవాహనాలు..
సూర్యాపేటక్రైం : జిల్లా కేంద్రంలోని అన్నాదురైనగర్‌లో మంగళవారం తెల్లవారు జామున డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శంకర్ ఆధ్వర్యంలో 150మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత, రక్షణ కల్పించడం, దొంగతనాలు నివారించడం, అక్రమకార్యకాలపాలు, సంఘ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తుల గుర్తింపు, శాంతి భద్రతల రక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల అదుపు చేయడము కోసమే జిల్లా వ్యాప్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్‌సెర్చ్ నిర్వహించేటప్పుడు ప్రజలు ఆందోళన చెందవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment