ఇక పోలీసులకూ వీక్లీ ఆఫ్..!
నల్లగొండ ఎస్పీ శ్రీకారం
ఆనందంలో కుటుంబాలు
రాష్ర్టమంతా అమలు చేయాలి
పోలీసు అధికారుల సంఘం వినతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ‘పోలీసులకు.. వారాంతపు సెలవు’పై నల్లగొండ పోలీసు అధికారులు తొలి అడుగు వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త రాష్ట్రంలో ఈ విప్లవాత్మక నిర్ణయం అమలవుతున్న తొలి జిల్లాగా నల్లగొండ రికార్డుల్లోకి ఎక్కింది. జిల్లా ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాలతో ఈనెల 22 నుంచి ఈ జిల్లాలో కానిస్టేబుల్‌స్థాయి నుంచి సీఐల వరకు వీక్లీ ఆఫ్‌ను వినియోగించుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, తొలి ప్రసంగంలోని పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండలో జరిగిన జిల్లా పోలీసు అధికారుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఎస్పీ అక్కడికక్కడే ఈ ప్రకటన చేశారు.
‘32 ఏళ్ల సర్వీసులో ఈనెల 22వ తేదీన చాలా సంతోషంగా అన్పించింది. ఆ రోజు నాకు వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్) వచ్చింది. ఆనాడు కుటుంబ సభ్యులమంతా బేఫికర్‌గా గడిపాం. బంధువుల ఇంట్లో పెళ్లికి కలిసే వెళ్లాం. గతంలో సెలవు పెట్టినా, స్టేషన్ నుంచి ఎప్పుడు ఎవరి ఫోన్ వస్తుందో తెలియక టెన్షన్‌తో గడిపేవాడిని. మాకూ వీక్లీ ఆఫ్ ఇవ్వాలని పోలీసు మాన్యువల్ ఉన్నా ఏ ప్రభుత్వాలూ ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఇన్నేళ్లకు నిజమైంది. ఇలాగే, 8 గంటల పని దినాన్ని కూడా అమలు చేయాలి..’ అని భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న వై.వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు, నల్లగొండ జిల్లా పోలీసుశాఖలో అమలవుతున్న ‘వీక్లీ ఆఫ్’ సిబ్బందిలో ఎంతటి ఆనందాన్ని నింపిందో అర్థం చేసుకోవడానికి.
పది రోజుల పాటు కసరత్తు చేసిన జిల్లా పోలీసు అధికారులు ఏ పోలీసుస్టేషన్లలో ఎవరెవరికి ఏయే రోజు వారాంతపు సెలవు ఇవ్వనున్నారో పట్టిక తయారు చేశారు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ఈనెల 22వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు మొదలై మూడు రోజులు పూర్తయ్యింది. ఈ మూడు రోజుల్లో వారాంతపు సెలవును వినియోగించుకున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను 9వ తరగతి చదువుతున్నా. ఇప్పటివరకు నాన్నకు సెలవన్న మాటే వినలేదు. కానీ నిన్న సడెన్‌గా స్టేషన్ నుంచి ఫోన్ చేసి నీకు ఈ రోజు వీక్లీఆఫ్ అలాట్ చేశామన్నట్లు నాన్న చెప్పారు. చాలా సంతోషమేసింది. వారంలో ఒక్క రోజు నాన్న మాతో గడుపుతారన్న ఆలోచన కొత్తగా అనిపించినా.. చాలా ఆనందంగా ఉంది. ఇక నాన్న రోజంతా మాతో గడుపుతారని తెలి సింది. ఎస్పీ అంకుల్‌కి థ్యాంక్స్’ అని దేవరకొండకు చెందిన కానిస్టేబుల్ నాగార్జున కుమార్తె అలేఖ్య సంబరపడిపోయింది. ‘సమైక్య రాష్ట్రంలోని 1.30 లక్షల మంది పోలీసు సిబ్బందిలో మానసిక ఒత్తిడి వల్ల రోజుకు ఇద్దరు పోలీసు ఉద్యోగులు చనిపోయినట్లు మా సర్వేలో తేలింది. అదే తెలంగాణలోని 50 వేల మంది సిబ్బందిలో రోజుకొకరు చొప్పున చనిపోతున్నారు.
ఇతర ఏ ప్రభుత్వ శాఖల్లో ఈ విపరీతం లేదు. డీఎస్పీ స్థాయి వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. అయినా, తొలి అడుగు పడింది. దీనికి సీఎం కేసీఆర్‌కు, హోం మినిష్టర్, డీజీపీలకు, నల్లగొండ ఎస్పీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇతర జిల్లాల ఎస్పీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం..’ అని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి వివరించారు.
విశ్రాంతి దొరికింది
పోలీస్‌శాఖలో వీక్లీ ఆఫ్ అమలు చేయడం సంతోషంగా ఉంది. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా. అత్యవసర పని ఉంటే సెలవు మంజూరు చేయించుకుని వెళ్లాలి. వారంలో ఒక రోజైనా సొంత పనులు చేసుకునే అవకాశం లభించేది కాదు. వారాంతపు సెలవులే కాకుండా పని భారాన్ని తగ్గిస్తే ఇంకా బాగుంటుంది.
- జోగునూరి వీరమల్లయ్య, హెడ్ కానిస్టేబుల్, సూర్యాపేట
కుటుంబాన్ని చూసుకునే అవకాశం
పోలీసులతో పాటు హోంగార్డులకు కూడా ప్రభుత్వం వారాం తపు సెలవులివ్వడం ఎంతో ఆనందంగా ఉంది. సెలవు రోజు కుటుంబ సభ్యులతో గడపడంతోపాటు కుటుంబ పనులు చక్కబెట్టుకునేందుకు వీలు లభించినట్లయింది. సెలవులు లేకపోవడంతో చిన్న చిన్న సంతోషాలకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చేది. ప్రభుత్వం మా శ్రమను గుర్తించడం అభినందనీయం.
- రేణుక, హోంగార్డు, నకిరేకల్