నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ మండలి స్థానానికి గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 11 తేదీన ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 19 తేదీ నుంచి 26వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న మూడు జిల్లాల అభ్యర్థుల నామినేషన్లు నల్లగొండ జిల్లాలోనే దాఖలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు, మరో నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కలెక్టరేట్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేస్తారు.
నేటితో ఓటరు నమోదు ఆఖరు ...
ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే నాటికి మూడు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 2,62,582 మంది ఉన్నారు. అయితే జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దీంతో బుధవారం సాయంత్రానికి జిల్లాలో 970 మంది కొత్తగా ఓటరు నమోదు చేసుకున్నారు. ఓటరు నమోదుకు గురువారంతో గడువు ముగుస్తుంది. కొత్తగా ఓటరు దరఖాస్తు చేసుకున్న వివరాలను ఆధారంగా చేసుకుని ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి విచారించడంతో పాటు ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకస్తారు. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. అదే రోజున పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. అన్ని రాజకీయ పక్షాలకు, పోటీ లో ఉన్న అభ్యర్థులకు ఓటర్ల జాబితా అందజేస్తారు.
ఫొటోల సేకరణ వేగవంతం...
నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 85,974 మంది ఉన్నారు. వీరిలో 62,973 మందికి ఫొటో ఓటరు గుర్తింపుకార్డులు ఉన్నాయి. మిగిలిన 23 వేల మందికి ఫొటో గుర్తింపుకార్డుల్లేవు. ఈ ఎన్నికల్లో ఓటరు గుర్తింపుకార్డు తప్పనిసరి చేశారు. దీంతో మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా బిల్ కలె క్టర్లు, గ్రామాల్లో వీఆర్వోలకు ఫొటోలు సేకరించే బాధ్యత అప్పగించారు. ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఫొటోలు సేకరించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే మన జిల్లాలో 95 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మండలానికి ఒకటి చొప్పున 59 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ఉన్న 36 పోలింగ్ స్టేషన్‌లు...వెయ్యి ఓట్లకు మించి ఎక్కువగా ఉన్న మండలాల్లో ‘బై’ పోలింగ్ కేంద్రాలుగా వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
‘కోడ్’ కూసిన పట్టింపులేదు...
ఈ నెల 11 నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలోనే రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. క్లాక్ టవర్ సెంటర్‌లో రాజకీయ నాయకుల కటౌట్లు, ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు ఇంకా తొలగించలేదు. అధికారుల సమీక్షా సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు వాయిదా వేశారు కానీ...గోడల మీద రాతలు, పోస్టర్ల తొలగింపు మాత్రం ఇంకా చేపట్టలేదు.
నేటినుంచి... నామినేషన్లు షురూ
Published Thu, Feb 19 2015 12:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement