సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ సమరానికి నగారా మోగింది. ఈ నెల చివరలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్లకు గాను, ఒక్కో డివిజన్‌కు తేదీలను కేటాయించారు. ఈ నెల 21వ తేదీన దేవరకొండ డివిజన్, 25వ తేదీన మిర్యాలగూడ, 30వ తేదీన నల్లగొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో ప్రస్తుతం 837 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరో ఏడు గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తికాని కారణంగా వాటికి ఎన్నిలు జరపడం లేదు. గిరిజన తండాలన్నింటినీ పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. గిరిజన గ్రామ పంచాయతీలను అన్నింటినీ వారికే రిజర్వు అయ్యాయి. దీంతో జిల్లాలో ఏకంగా 104 గ్రామ పంచాయతీలు గిరిజనులకే రిజర్వు అయ్యాయి. వీటితోపాటు రిజర్వేషన్ల కోటా మేరకు అదనంగా మరో 69 పంచాయతీలు వారికే కేటాయించడంతో ఈసారి గిరిజన సర్పంచుల సంఖ్య 173కు చేరనుంది. కాగా, ఎస్సీలకు 136, బీసీలకు 165, అన్ రిజర్వుడుగా (జనరల్) 370 పంచాయతీలను ప్రకటించారు. ఈ మొత్తంలో 50 శాతం మహిళలకు కేటాయించారు.
ఓటుహక్కు వినయోగించుకోనున్న 8.96లక్షల మంది
గ్రామ పంచాయతీ ఎన్నిల్లో నల్లగొండ జిల్లా పరిధిలో ఈసారి 8,96,853 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో ఎస్సీ ఓటర్లు 1,65,355, ఎస్టీ ఓటర్లు 1,30,316, బీసీ ఓటర్లు 4, 91,311 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకతీతంగా జరగనున్నాయి. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఈవీఎంల మాదిరిగానే, ఈసారి బ్యాలెట్ పేపర్లపై కూడా ‘నోటా’ గుర్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక, పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలై, మధ్యాహ్నం 1 గంట దాకా జరుగుతుంది. గంట భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలనుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, విజేతల ప్రకటన ఉంటాయి. మరునాడు ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
రాజకీయ పార్టీల్లో సందడి
గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీ రహిత ఎన్నికలైనా.. పంచాయతీల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది. వాస్తవానికి ఇప్పటికే ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే విషయంలో దాదాపు స్పష్టతకు వచ్చారు. పోటీ చేయడానికి ఉత్సాహపడతున్న ఆశావహులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పంచాయితీల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయి నాయకులు తంటాలు పడతున్నారు. ఈ సారి మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని, తద్వారా ఎన్నికల ఖర్చును తగ్గించడంతోపాటు, ఆయా పంచాయతీకు రూ.5లక్షల ప్రోత్సాహం అందుతుందని భావించి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార టీఆర్‌ఎస్ ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరిగినా, ఏకగ్రీవాలకు అంతగా అవకాశం కనిపించడం లేదంటున్నారు.
కాంగ్రెస్‌లోనూ పోటీ చేయాలని ఉత్సాహవంతులు ఎక్కువగానే ఉన్నా, ఎన్నికల ఖర్చు వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, టీఆర్‌ఎస్‌లో మాత్రం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకే సర్పంచ్ ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు సైతం స్థానికంగా మాట్లాడుకుని, ఒక అభిప్రాయానికి వచ్చాక తమ దగ్గర రావాలని గ్రామస్థాయి నాయకత్వానికి సూచించారు. అధికార టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు లేని చోట కూడా ఇన్‌చార్జులు ఇప్పటికే పంచాయతీల బాధ్యతలు భుజన వేసుకుని పంచాయితీలు పరిష్కరించి, సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో అంత ఊపు కనిపించకున్నా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో మాత్రం పంచా యతీ ఎన్నికలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment