నల్లవాగు.. ఆశల సాగు!
కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుపై పలు గ్రామాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నల్లవాగు పూర్తిస్థాయిలో పారేలా చూస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతులు మాత్రం దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గండ్లు, బుంగలు పడిన కాలువల కారణంగా చివర ఆయకట్టు భూములకు నీరు చేరడం లేదు. దీంతో సారవంతమైన భూములు బీడుగా మారాయి. ప్రాజెక్టు కింది భాగంలోని ఎమర్జెన్సీ కెనాల్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. సీసీ లైనింగ్ పగిలి కాలువల్లో నీటి ప్రవాహం జరగడం లేదు.
రెండేళ్ల క్రితాలువల మరమ్మతులు చేపట్టినా పనుల్లో నాణ్యత లోపించడం వల్ల ప్రజా ధనం వృథా కావడం మినహా ఆయకట్టు రైతులకు మేలు చేకూరింది లేదు. నల్లవాగు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1,493 అడుగులు. ప్రస్తుతం 1,483 అడుగులు ఉంది. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు తప్పనిసరి. గండ్లు, బుంగలు పడి కాలువలు శిథిలమయ్యాయి. వీటిని ఆధునికీకరించేందుకు 2009-10 ఆర్థిక సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 14.19 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో జరిగిన పనుల్లో నాణ్యత లోపించింది. దీంతో సిమెంట్ కట్టడాలు బీటలు వారాయి.
పోచాపూర్, బీబీపేట, ఖాజాపూర్ రోడ్డు, మార్డి, కృష్ణపూర్ గ్రామాల వద్ద సిమెంట్ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల కాలువల మధ్య పిచ్చి మొక్కలు పెరిగాయి. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. రైతుల అగమ్యగోచరంగా మారింది. ప్రాజెక్టును నమ్ముకొని పంటలు సాగు చేస్తే మునిగిపోవడం ఖాయమని భావించిన రైతులు బోర్లు వేసుకుంటున్నారు. ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేసే ముందే శిథిలమైన కాలువలను బాగుచేయాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు
1967లో కల్హేర్ మండలం సుల్తానాబాద్ వద్ద రూ. 98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,493 అడుగులు. కుడి కాలువ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాల్లో 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్‌గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు బాగుపడకపోవడంతో ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు.