ఇది నిజాంసాగర్‌ కాలువే...! | Dilapidated Of nizam Sagar Canals | Sakshi
Sakshi News home page

ఇది నిజాంసాగర్‌ కాలువే...!

Published Sat, Mar 9 2019 10:26 AM | Last Updated on Sat, Mar 9 2019 10:26 AM

Dilapidated Of nizam Sagar Canals - Sakshi

శిథిలావస్థకు చేరిన తూము

సాక్షి, నందిపేట్‌(నిజామాబాద్‌): రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. కానీ సాగునీటి సరఫరా కోసం నిర్మించిన కాలువలు, తూములకు మరమ్మతులు చేయించడానికి నిధులను మాత్రం మంజూరు చేయడం లేదు. దీంతో తూములు, కల్వర్టులు, కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన కాలువల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో నీరు దిగువకు చేరకుండా అడ్డుపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా షట్టర్లు విరిగి పోవడం, మరికొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లడంతో నీరు వృథా అయ్యే ప్రమాదం ఉంది.

మరికొన్ని చోట్ల కాలువల్లో ఇసుక మేటలు పెడుతున్నాయి. కాల్వ నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం. ప్రధాన కాలువలే కాకుండా పంటపొలాలకు సాగునీరు అందించడానికి పిల్ల కాలువలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అవి ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. కాలువల మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. నందిపేట మండలం పరిధిలో డిస్ట్రిబ్యూటరి కెనాల్‌ 74 ప్రధాన కాలువ 19కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. దీనికి 11 సబ్‌ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. కానీ వీటిలో నాలుగింటికి మాత్రమే షట్టర్లు ఉన్నాయి.

ఈ ప్రధాన కాలువ ద్వారా నందిపేట, మాక్లూర్‌ మండలాల్లోని సుమారు 26 గ్రామాలకు సాగునీరు అందించాలి. కాని ప్రతి సంవత్సరం నందిపేట మండలంలోని ఆంధ్రనగర్, వెల్మల్, అయిలాపూర్, కంఠం గ్రామాలకు మాత్రమే నీరు చేరుతుంది. నిజాంసాగర్‌ ప్రధాన కాలువలు, పిల్లతూములు, తూములు, షట్టర్లు మరమ్మతులు కాగితాలకే పరిమితం అయ్యాయి.  ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన కాలువతో పాటు 82 డిస్ట్రిబ్యూటర్‌ కాలువల జంగల్‌ కటింగ్, తూముల మరమ్మతులు, ఇసుక మేటలను వెంటనే తొలగించాలి. కానీ ఇప్పటివరకు పనులు సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. దీంతో పంటపొలాలలకు నీరు చేరకుండా పోతుంది.

 తూములకు అడ్డంగా ఉన్న షట్టర్లు

మరమ్మతులను పూర్తి చేయించాలి..

నిజాంసాగర్‌ ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, తూములు, షట్టర్లు, కాలువ కట్టలకు ఉన్న గండ్లు, లీకేజీల కోసం ఇరిగేషన్‌ అధికారులు రీసర్వే చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేషన్‌ తయారు చేయాలి. విడతల వారీగా నిధులు మంజూరు చేసి పనులు త్వరగా పూర్తి చేయాలి.
–బండి నర్సగౌడ్, రైతు, బజార్‌ కొత్తూర్‌

చివరి ఆయకట్టు వరకు నీరందించాలి..

నిజాంసాగర్‌ కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. ఇందులో భాగం గా కాల్వలకు సీసీ లైనింగ్‌ పనులతో పాటు లీకేజీలను సరిచేయాలి. చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. నీటి సరఫరా చేసేందుకు నియమించిన గ్యాంగ్‌మెన్లు విధులు సక్రమంగా నిర్వహించేటట్లు చర్యలు తీసుకుని అన్ని గ్రామాలకు నీరందించాలి.
–ఉమ్మెడ, రైతు, నందిపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement