dilapidated situation
-
శిథిల గదులు – సిబ్బంది వ్యథలు
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): నియోజకవర్గంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో విలువైన ఫైల్లు, ఇతర సామగ్రికి భద్రత లేకుండా పోయింది. వీటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో మొత్తం 57 ప్రభుత్వ కార్యాలయాలకు గాను వీటిలో 13 వరకు శిథిలభవనాల్లో నడుస్తున్నాయి. అన్ని మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయాలు పూర్తిగా పాడయ్యాయి. సీతంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయం శిథిలమైంది. అయితే ఈ భవన సముదాయానికి సంబంధించి నూతన భవనాలు నిర్మాణానికి ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేశారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అలాగే గిరిజన సహకార సంస్థ భవనాలు, మండల రెవెన్యూ కార్యాలయం, ఎంఆర్సీ కార్యాలయం పూర్తిగా పాడయ్యాయి. చిన్నపాటి వర్షం పడినా వరదతో నిండిపోతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. భామిని మండలంలో భామిని, బత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు మరమ్మతులకు గురయ్యాయి. పాలకొండలో మండల విద్యావనరుల కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, ఇరిగేషన్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం శిథిలమయ్యాయి. వీరఘట్టం మండలంలో వ్యవసాయ కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయలాది ఆదేదారి. వీటి స్థానంలో కొత్తవి ఎప్పుడు నిర్మిస్తారనేది ప్రశ్నగా మారింది. మరికొన్ని కార్యాలయాలు పరాయి పంచన నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ప్రజలు వేడుకుంటున్నారు.ఽ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు.. మండలం ప్రభుత్వ కార్యాలయాలు శిథిలమైనవి సీతంపేట 18 4 పాలకొండ 15 5 వీరఘట్టం 14 2 భామిని 10 2 మొత్తం 57 13 ఎప్పటి నుంచో సమస్య ఉంది శిథిల భవనాల స్థానంలో నూతన భవనాలు మంజూరు చేయాలని గతంలో పలు మా ర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. రికార్డులకు భద్రత లేకుండా పోతోంది. చిన్నపాటి వర్షం కురిసినా సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ కార్యాలయాలన్నీ అలాగే ఉన్నాయి రెవెన్యూ, వ్యవసాయశాఖ ఇలా మండలంలో ఏ కార్యాలయాలు చూసినా శిథిల భవనాలే దర్శనమిస్తున్నాయి. ఎంపీడీవో కార్యాయలం పూర్తిగా పాడైంది. అయితే తప్పదన్నట్లు అక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలి. – ఎస్.భాస్కరరావు, కారెంకొత్తగూడ -
ఇది నిజాంసాగర్ కాలువే...!
సాక్షి, నందిపేట్(నిజామాబాద్): రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. కానీ సాగునీటి సరఫరా కోసం నిర్మించిన కాలువలు, తూములకు మరమ్మతులు చేయించడానికి నిధులను మాత్రం మంజూరు చేయడం లేదు. దీంతో తూములు, కల్వర్టులు, కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన కాలువల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో నీరు దిగువకు చేరకుండా అడ్డుపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా షట్టర్లు విరిగి పోవడం, మరికొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లడంతో నీరు వృథా అయ్యే ప్రమాదం ఉంది. మరికొన్ని చోట్ల కాలువల్లో ఇసుక మేటలు పెడుతున్నాయి. కాల్వ నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం. ప్రధాన కాలువలే కాకుండా పంటపొలాలకు సాగునీరు అందించడానికి పిల్ల కాలువలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అవి ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. కాలువల మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. నందిపేట మండలం పరిధిలో డిస్ట్రిబ్యూటరి కెనాల్ 74 ప్రధాన కాలువ 19కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. దీనికి 11 సబ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. కానీ వీటిలో నాలుగింటికి మాత్రమే షట్టర్లు ఉన్నాయి. ఈ ప్రధాన కాలువ ద్వారా నందిపేట, మాక్లూర్ మండలాల్లోని సుమారు 26 గ్రామాలకు సాగునీరు అందించాలి. కాని ప్రతి సంవత్సరం నందిపేట మండలంలోని ఆంధ్రనగర్, వెల్మల్, అయిలాపూర్, కంఠం గ్రామాలకు మాత్రమే నీరు చేరుతుంది. నిజాంసాగర్ ప్రధాన కాలువలు, పిల్లతూములు, తూములు, షట్టర్లు మరమ్మతులు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన కాలువతో పాటు 82 డిస్ట్రిబ్యూటర్ కాలువల జంగల్ కటింగ్, తూముల మరమ్మతులు, ఇసుక మేటలను వెంటనే తొలగించాలి. కానీ ఇప్పటివరకు పనులు సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. దీంతో పంటపొలాలలకు నీరు చేరకుండా పోతుంది. తూములకు అడ్డంగా ఉన్న షట్టర్లు మరమ్మతులను పూర్తి చేయించాలి.. నిజాంసాగర్ ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, తూములు, షట్టర్లు, కాలువ కట్టలకు ఉన్న గండ్లు, లీకేజీల కోసం ఇరిగేషన్ అధికారులు రీసర్వే చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేషన్ తయారు చేయాలి. విడతల వారీగా నిధులు మంజూరు చేసి పనులు త్వరగా పూర్తి చేయాలి. –బండి నర్సగౌడ్, రైతు, బజార్ కొత్తూర్ చివరి ఆయకట్టు వరకు నీరందించాలి.. నిజాంసాగర్ కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. ఇందులో భాగం గా కాల్వలకు సీసీ లైనింగ్ పనులతో పాటు లీకేజీలను సరిచేయాలి. చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. నీటి సరఫరా చేసేందుకు నియమించిన గ్యాంగ్మెన్లు విధులు సక్రమంగా నిర్వహించేటట్లు చర్యలు తీసుకుని అన్ని గ్రామాలకు నీరందించాలి. –ఉమ్మెడ, రైతు, నందిపేట -
శిధిలావస్థలో బాబు చదివిన పాఠశాల
-
శిథిలావస్థలో ఎంపీపీ కార్యాలయం
భయం భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పట్టించుకోని అధికారులు అల్లాదుర్గం: గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే కార్యాలయమే శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భవనం నిర్మించి 15 ఏళ్లు కాకముందే శిథిలం కావడం... భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను పాటించారో అర్థం చేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు కార్యాలయం ఉరుస్తుండటంతో ప్రజలతో పాటు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీళ్లకు ఫైల్ తడిసి ముద్దవుతున్నాయి. అల్లాదుర్గం ఎంపీపీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే శ్లాబ్ పైనుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ భవనాన్ని 2002లో ప్రారంభించారు. భవనం నిర్మించి 15 ఏళ్లు దాటక ముందే శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది భయాబ్రాంతులకు గురవుతూనే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం గోడలు తడవడంతో విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. వర్షపు నీటికి గోడలు పాకురుపట్టాయి. మండల సర్వసభ్య సమావేశాలను మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నా... ఈ భవనం గురించి తీర్మానం చేసిన దాఖలాలు లేవు. ప్రమాదం జరిగితే తప్పా అధికారులు స్పందించరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న భవనం మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.